Breaking News

23/01/2020

ఢిల్లీ షా ఎవరు...

న్యూఢిల్లీ, జనవరి 23 (way2newstv.in)
ల్లీ… దేశ రాజధాని నగరం. దేశంలోని నగరాల్లో కల్లా అతి పెద్దది. ఈ మహానగరం మినీ భారతాన్ని పోలి ఉంటుంది. భిన్న సంస్కృతులు, భాషలు, ఆచారా వ్యవహారాలు, సంప్రదాయాలు గల ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల ప్రజల సంగమం. పంజాబీలు, సిక్కులు, బీహారీలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, తెలుగు, తమిళ, కన్నడ, కేరళ, మరాఠీలు ఈ మహానగరంలో నివసిస్తుంటారు. అందువల్ల ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయి. అదే విధంగా ప్రజల తీర్పు కూడా విభిన్నంగా ఉంటుంది. వచ్చే నెల 8వ తేదీన జరిగే 70 స్థానాల అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టగా మారాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 
 ఢిల్లీ షా ఎవరు...

మూడో పార్టీ అయిన అఖిల భారత కాంగ్రెస్ రంగంలో ఉన్నప్పటికీ దాని ప్రభావం పరిమితమేనని చెప్పుకోవాలి.దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీకి ఈ ఎన్నికలు నిజంగా అగ్ని పరీక్ష వంటివి. గత లోక్ సభ ఎన్నికల ఫలితలు ప్రాతిపదికగా చూస్తే ఈ పార్టీకి విజయం నల్లేరు మీద నడకే కావాలి. మొత్తం ఏడు లోక్ సభ స్థానాలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ వాస్తవానికి కంగారు పడనక్కరలేదు. కానీ లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో బీజేపీ కిందా మీదా పడుతుంది. వాస్తవానికి మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలకు నాటి మిత్రపక్షమైన శివసేనతో కలిపి 41, హర్యానాలో పదికి పది, జార్ఖండ్ లో పన్నెండుకు పది స్థానాలను గెలిచిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందని ఆశించి భంగపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీపై ఆచితూచి అడుగేయాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు కేవలం మూడంటే మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ అవమాన భారాన్ని దిగమింగుకున్నారు. 32.19 శఆతం ఓట్లకే పరిమితమయ్యారు. ఏకంగా 67 సీట్లను గెలుచుకున్న అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 54.34 శాతం ఓట్లతో విజయకేతనం ఎగురవేసింది. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. కేవలం 9.65 శాతం ఓట్లతో సరిపుచ్చుకుంది. ఇప్పుడిప్పుడే శక్తిని కూడ తీసుకుంటోంది.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంస్థాగత సమస్యలున్నాయి. బీజేపీ అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుండి నడిపించే నాయకుడు లేరు. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే స్థితిలో లేదు. గత ఎన్నికల్లో అకస్మాత్తుగా కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి చేతులు కాల్చుకుంది. పార్టీతో సహా ఆమె కూడా ఓడిపోయింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా రాజకీయ పునరావాసం పొందారు. ఢిల్లీకి చెందిన హర్షవర్థన్ కేంద్రమంత్రిగా ఉన్నారు. డాక్టర్ అయిన ఆయనకు మంచివాడన్న పేరుంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ జన్మభూమి వంటి అంశాలు ఓట్లను రాల్చవన్న సంగతి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రుజువు కావడంతో బీజేపీ మోదీ పథకాలనే నమ్ముకుంది. అరవింద్ కేజ్రీవాల్ పాలన అంత గొప్పగా ఏమీ లేనప్పటికీ ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదట్లో మోదీకి వ్యతిరేకంగా హడావిడి చేసినప్పటికీ, తనది ఆ స్థాయి కాదని అర్థమయింది. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. విద్య, వైద్య సంస్కరణలు, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత రవాణా సదుపాయం, ఉచిత వైఫై వంటి సేవలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కుదేలైంది. ఈసారి బీజేపీ ఓట్ల చీలికకే పార్టీ పరిమితం కానుంది. కమలం కన్నా కేజ్రీవాల్ కే గెలుపు కీలకం. ఆయన గెలిస్తే జాతీయ రాజకీయాల్లో కీలకం అవుతారు. మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి ఓడితే ప్రత్యేకంగా వచ్చే నష్టం లేదు. గెలిస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది.

No comments:

Post a Comment