Breaking News

28/12/2019

త్రిశంకు స్వర్గంలో టీడీపీ బాస్

విజయవాడ, డిసెంబర్ 28 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిన్నటివరకూ... వైసీపీ చెప్పిన మూడు రాజధానుల అంశంపై ఉత్తరాంధ్రతోపాటూ... రాయలసీమ వాసులు కూడా ఒకింత ఆనందంతో ఉండగా కేబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయమూ ప్రకటించకుండా వాయిదా వెయ్యడంతో... ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమైంది. మరో రిపోర్ట్ రావాలనీ, అది వచ్చాక... మరో హైపవర్ కమిటీ వేస్తామనీ... ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వం చెప్పడంతో... ఇది ఇప్పట్లో జరిగే పనికాదనే వాదన తెరపైకి వచ్చింది. ఎప్పుడైతే... ప్రజల్లో ఇలాంటి భావన వచ్చిందో... వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఉతికారేశారు. 
త్రిశంకు స్వర్గంలో టీడీపీ బాస్

ఐతే ఇదే రాజధాని అంశంపై 11 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు ఎందుకు ఆందోళనల్లో పాల్గొనలేదన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. చంద్రబాబు... జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడే గట్టిగా వ్యతిరేకించి ఉంటే... ఇప్పుడు తమకు మైలేజ్ వచ్చేదని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఇదివరకు రాష్ట్ర విభజన విషయంలోనూ చంద్రబాబు ఏ విషయమూ తేల్చకుండా చాలా కాలం నాన్చారు. కారణం... ఎక్కడ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే... ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందో అన్న ఆందళనే. మొత్తానికి ఆ విషయంలో ఎలాగొలా నెట్టుకురాగలిగిన చంద్రబాబు... ఇప్పుడు మూడు రాజధానుల అంశంపై పాజిటివ్‌గా స్పందిస్తే... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీపై వ్యతిరేకత వస్తుంది. అదే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే... ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీకి నెగెటివ్ మార్క్స్ వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందడుగు వెయ్యలేక... ఏం చెయ్యాలో తెలియక ఈ పది రోజులూ చంద్రబాబు సైలెంటైపోయారన్న వాదన వినిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం రాజధానిపై కచ్చితమైన నిర్ణయంతో లేదని తేలిందో... సరిగ్గా ఆ టైం చూసి చంద్రబాబు స్పందించారన్న వాదన పొలిటికల్ సర్కిల్స్ నుంచీ వినిపిస్తోంది.మొత్తంగా చూస్తే... ప్రభుత్వం రాజధాని అంశంపై నిర్ణయాన్ని వాయిదా వెయ్యడం వెనక అమరావతిలో రైతుల ఆందోళనలే అసలైన కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో రైతులకే మైలేజ్ వచ్చింది తప్ప... టీడీపీకి రాలేదు. అసలే ఎన్నికల తర్వాత కుదేలైన టీడీపీ... అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.బీజేపీ మాత్రం ఈ విషయంలో తెలివిగా పావులు కదిపిందన్న వాదన కూడా వినిపిస్తోంది. మొదట్నుంచీ వైసీపీ నిర్ణయాన్ని తప్పు పడుతున్న బీజేపీ... ఏకంగా ధర్నాకు దిగడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ గంట పాటూ అమరావతిలో మౌన దీక్ష చెయ్యడం వంటివి ఆ పార్టీకి కాస్త మైలేజ్ తెచ్చాయంటున్నారు. ఇకపై ఈ అంశంపై ఏ పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందన్నదాన్ని బట్టీ... రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు ఉంటాయనుకోవచ్చు.

No comments:

Post a Comment