Breaking News

05/12/2019

పేరుకే యూనివర్సిటీ (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, డిసెంబర్ 05 (way2newstv.in): 
పేరుకు విశ్వవిద్యాలయమైనా ఇక్కడ నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను వేరే చోట నిర్వహించడంతో క్రమేపి ఆదరణ కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఒక్క టోర్నమెంట్‌ కూడా నిర్వహించకపోవడం, యువజనోత్సవాల్లో కూడా జిల్లా కేంద్రాన్ని ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతర్‌ కళాశాలల పోటీల్లో సైతం ప్రజాదరణ పొందిన క్రీడలను యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించకపోవడంతో ఇక్కడి విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.  జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా 2008లో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటైన విషయం విదితమే. విద్యార్థులకు క్రీడలను చేరువ చేసే క్రమంలో భాగంగా 2010వ సంవత్సరంలో ఆచార్య మైనేని కేశవదుర్గాప్రసాద్‌ వ్యవస్థాపక ఉపకులపతిగా ఉన్న సమయంలో కృష్ణా విశ్వవిద్యాలయానికి స్పోర్ట్స్‌ బోర్డు ఏర్పాటు చేశారు. 
పేరుకే యూనివర్సిటీ (కృష్ణాజిల్లా)

అప్పుడే సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ డా.నల్లూరి శ్రీనివాసరావును స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచి కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున పలు జట్లను దక్షిణభారత, అఖిల భారత అంతర్‌విశ్వవిద్యాలయాల పోటీలకు పంపించారు. ఆచార్య వున్నం వెంకయ్య వీసీగా ఉన్న సమయంలో 2013లో తొలిసారిగా సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల టెన్నిస్‌ టోర్నమెంట్‌ను విజయవాడలోని ఆంధ్రలయోలా కళాశాలలో నిర్వహించారు. అప్పుడే కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున కూడా టెన్నిస్‌ జట్టు తొలిసారిగా సౌత్‌జోన్‌ క్రీడల్లో అరంగ్రేటం చేసింది. ఆ పోటీల్లో ప్రస్తుత భారత టెన్నిస్‌ జట్టు ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ కూడా మద్రాస్‌ విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించి విజృంభించి ఆడటడంతో మద్రాసు వర్సిటీ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. టోర్నీ నిర్వహణపై ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాన్నీ సంతృప్తిని వ్యక్తం చేయడంతో విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ పెరగడంతో పాటు క్రీడల పరంగా వర్సిటీ ఒక మెట్టుపైకెక్కింది. ఆ తర్వాత యూనివర్సిటీ తరఫున నందిగామలో మహిళల కబడ్డీ, విజయవాడ పీబీ సిద్ధార్థలో పురుషుల వాలీబాల్, టోర్నీలు జరిగాయి. మహిళల కబడ్డీ పోటీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం సత్తా చాటింది.క్రీడల పరంగా ప్రముఖ స్థానం ఉన్న మచిలీపట్నాన్ని విశ్వవిద్యాలయం విస్మరిస్తోందనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవడం, అధ్యాపక సిబ్బంది కూడా జోనల్‌ టోర్నమెంట్లను మచిలీపట్నంలో నిర్వహించకపోవడంపై ప్రశ్నించడంతో ఆచార్య సూర్యచంద్రరావు ఇన్‌ఛార్జి     ఉపకులపతిగా ఉన్న సమయంలో 2016లో తొలిసారిగా మచిలీపట్నంలోని ఆంధ్ర  జాతీయ కళాశాల మైదానంలో దక్షిణభారత అంతర్‌ విశ్వవిద్యాలయాల మహిళల వాలీబాల్‌ టోర్నీని నిర్వహించారు. దక్షిణ భారతావనికి సంబంధించిన సుమారు 60కి పైగా విశ్వవిద్యాలయాలకు చెందిన క్రీడాకారులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో కేరళకు చెందిన కాలికట్‌ విశ్వవిద్యాలయం టోర్నీ విజేతగా నిలిచింది. కేఆర్‌యూ క్రీడాకారిణులు కూడా ఆ టోర్నీలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీ అందించిన స్ఫూర్తితో ఆచార్య రామకృష్ణారావు కేఆర్‌యూ వీసీగా ఉన్నప్పుడు 2017లో అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల విలువిద్య(ఆర్చరీ) పోటీలను పద్మావతి కళాశాల మైదానంలో నిర్వహించారు. సుమారు 90 విశ్వవిద్యాలయాలు పాల్గొన్న ఈ పోటీలు కూడా విజయవంతంగా జరిగాయి.  2017 తర్వాత మళ్లీ ఇప్పటివరకు బందరులో అంతర్‌ విశ్వవిద్యాలయాల టోర్నీ అన్నదే జరగకపోవడంతో బందరు ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయం ఉంటే క్రీడా పోటీలను ఎక్కడెక్కడో నిర్వహిస్తుండడం పట్ల పలువురు క్రీడాకారులు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్రజాతీయ కళాశాల, హిందూ కళాశాల, నోబుల్‌ కళాశాల మైదానాలు ఎంతో చరిత్ర కలిగినవి. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ఆంధ్రజాతీయ కళాశాల మైదానంలో ఆడిన విషయం అందరికీ తెలిసిందే. అంతటి చారిత్రక మైదానం కనుకనే మచిలీపట్నంలో తొలిసారి జరిగిన సౌత్‌జోన్‌ మహిళా వాలీబాల్‌ పోటీలను ఇక్కడే నిర్వహించారు. రూ.లక్షలు వెచ్చించి జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన ఆరు కోర్టులను ఈ మైదానంలో సిద్ధం చేశారు. పోటీలు విజయవాడకు తరలించడంతో యూనివర్సిటీ నిధులతో తయారుచేసిన కోర్టులు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి.  జిల్లా కేంద్రంలో ఉన్న విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయిలో ఆటల పోటీలు జరిగితే విద్యార్థులంతా క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఇక్కడ అంతర్‌ కళాశాలల పోటీలు కూడా పూర్తిస్థాయిలో జరగకపోవడం, సౌత్‌జోన్, ఆలిండియా పోటీల్లో కూడా యూనివర్సిటీ క్యాంపస్‌కి రిక్తహస్తాలు ఎదురవడంతో విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కోల్పోయే పరిస్థితి నెలకొంది. అంతర్‌ కళాశాలల పోటీల్లో విశ్వవిద్యాలయం క్యాంపస్‌ నుంచి పోటీలకు వెళ్తున్న వారి సంఖ్య వేళ్లమీదనే లెక్కించవచ్చు. వారిలో క్రీడల పట్ల ఆసక్తిని కలిగించాలంటే మచిలీపట్నంలో టోర్నీలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. యూనివర్సిటీ డబ్బులతో నిర్వహించే జోనల్‌టోర్నీలు మచిలీపట్నంలో జరిగితే విశ్వవిద్యాలయానికి మంచి పేరు రావడంతో పాటు బందరు కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా వర్సిటీపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. పలువురు పేరొందిన క్రీడాకారులు ఇక్కడకు వస్తే వారి ఆటను చూసి భావి క్రీడాకారులు కూడా స్ఫూర్తిని పొందే ఆస్కారం ఉంది. కనీసం ఇక నుంచైనా జోనల్‌ క్రీడాపోటీలను మచిలీపట్నంలో నిర్వహిస్తేనే విశ్వవిద్యాలయాలనికి మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment