Breaking News

19/12/2019

రాజధానిపై టీడీపీ దారెటు

విజయవాడ, డిసెంబర్ 19 (way2newstv.in)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని చంపేయడానికి వైసీపీ సిద్ధపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆదేశిస్తుందా? సూచన చేస్తుందా? ఏదీ పట్టించుకోదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటుందని జగన్ అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజధాని అమరావతిలో కేవలం లెజిస్లేచర్ క్యాపిిటల్ మాత్రమే ఉంటుందని చెప్పారు. 
 రాజధానిపై టీడీపీ దారెటు

దీనిపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు దీనిిపై సైలెంట్ గానే ఉంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జీవీఎల్ నరసింహారావు అయితే అధికార వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుందని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సయితం జగన్ చేసిన ప్రకటనలో ఇంకా స్పష్టత లేదన్నారు. తాము అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు.ఎక్కువమంది రాష్ట్ర బీజేపీ నేతలు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏముంటందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రజలు జగన్ ప్రకటనను స్వాగతిస్తుండటంతో రాజకీయ పార్టీల స్వరంలో కూడా మార్పు కన్పిస్తుంది. దీంతో మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేస్తానంటున్న పోరాటానికి ఆ ప్రాంత రైతుల నుంచి మినహా పెద్దగా మద్దతు లభించకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి జగన్ ప్రతిపాదనను ఉపసంహరింప చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

No comments:

Post a Comment