Breaking News

20/12/2019

ప్యాసింజర్ టిక్కెట్ లేకపోతే..కండక్టర్ కు చిక్కు

హైద్రాబాద్, డిసెంబర్ 20, (way2newstv.in)
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కండక్టర్‌ను పిలిచి టికెట్ తీసుకొనే బాధ్యత ఇక పూర్తిగా వినియోగదారులదే.. దీనికి కండక్టర్లు బాధ్యులు కానే కారు. ఒకవేళ డబ్బు తీసుకొని కూడా కండక్టర్ టికెట్ ఇవ్వకపోతే, అప్పుడు కండక్టర్ అది మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటిదాకా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణికులెవరైనా పట్టుబడితే, తనిఖీ అధికారులు కండక్టర్‌ను ప్రశ్నించే సందర్భాలుండేవి. కానీ ఇప్పుడు నిబంధనలు మారనున్నాయి. అంతేకాక, సరైన యూనిఫాం ధరించలేదనో, అధికారులపై దురుసుగా ప్రవర్తించారంటూ ‘ఇన్‌-సబార్డినేషన్‌’ కేసులు రాయడం వంటి ఇబ్బందులు ఇక మీదట కండక్టర్లు, డ్రైవర్లకు ఉండబోవు. 
ప్యాసింజర్ టిక్కెట్ లేకపోతే..కండక్టర్ కు చిక్కు

ఇలా కఠినమైన నిబంధనలు తొలగిస్తూ... ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఓ నివేదిక సిద్ధమైంది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా అతి త్వరలో యాజమాన్యం ఉద్యోగ భద్రత ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు పురుషోత్తం, టీవీ రావు, వినోద్‌, యాదగిరితో గురువారం సమీక్ష నిర్వహించారు.నివేదిక ప్రకారం.. ఒకవేళ ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని, టికెట్‌ ఇవ్వకపోతే కండక్టర్‌నే బాధ్యుడిని చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో ఇదివరకు ఉద్యోగాల నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే... ఈసారి డిస్మిస్‌ ప్రస్తావన లేకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చార్జిషీట్లు, వివరణలు, సస్పెన్షన్లను అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
జనవరి 1 నుంచి కార్గో సేవలు...
ఆర్టీసీలో జనవరి 1 నుంచి కార్గో(సరకు రవాణా) సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కార్గో సేవలకు సీఎంనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయాలని ఆర్టీసీ నిర్ణయించగా.. ఈ సేవలను ఆయనతోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి కార్గో బస్సుపై ఓవైపు సీఎం కేసీఆర్‌ బొమ్మ, మరో పక్క రవాణా మంత్రి పువ్వాడ బొమ్మ ముద్రించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కార్గో మాదిరి బస్సును 23న ప్రదర్శించనున్నారు.

No comments:

Post a Comment