Breaking News

05/12/2019

ఇక బల్దియాలో దశల వారీగా ప్రైవేటీకరణ

హైద్రాబాద్, డిసెంబర్ 5, (way2newstv.in)
మహానగరంలోని సుమారు కోటిన్నర జనాభాకు అందించాల్సిన అతిముఖ్యమైన, అత్యవసరమైన సేవలను అందించే బాధ్యత నుంచి బల్దియా క్రమంగా తప్పుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు పారిశుద్ద్యం, రోడ్ల నిర్వాహణ వంటి బాధ్యతలను ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైన బల్దియా క్రమంగా పౌరసేవలను కూడా ప్రైవేటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థగా బర్త్,డెత్ సర్ట్ఫికెట్లను పౌరులకు ఉచితంగా ఇవ్వాల్సిన జీహెచ్‌ఎంసీ వాటిని ఈసేవా, మీసేవాలకు అనుసంధానం చేసి, ఒక్కో సర్ట్ఫికెట్‌కు రూ.20 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఇదే రకంగా ఆర్థిక సంక్షోభాన్ని కారణంగా చూపుతూ, మెరుగైన సేవల కోసమేనంటూ మరిన్ని విభాగాలకు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. 
ఇక బల్దియాలో దశల వారీగా ప్రైవేటీకరణ

మహానగరంలోని 30 సర్కిళ్లలో ప్రతిరోజు పోగయ్యే సుమారు 7వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ, ట్రాన్స్‌ఫర్ స్టేషన్, డంపింగ్‌యార్డులకు తరలించే బాధ్యతలను రాంకీ ఎన్విరో సంస్థకు అప్పగిస్తూ గతంలోనే అగ్రిమెంటు చేసుకున్నారుజ అప్పట్లో గుర్తింపు, గుర్తింపుయేతర యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించటంతో కొంత వెనక్కి తగ్గిన బల్దియా వచ్చే నెల 1వ తేదీ నుంచి రాంకీకి పూర్తి స్తాయిలో పారిశుద్ధ్య విధులను అప్పగించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితం బల్దియా అధికారులు, రాంకీ ఎన్విరో సంస్థకు చెందిన ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. తొలుత జోన్ల వారీగా రాంకీకి చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను అప్పగించాలని భావించినా, వచ్చే నెల 1వ తేదీ నుంచి గ్రేటర్‌లోని అన్ని సర్కిళ్లలో ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హయాంలో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలోని యంత్రాలు, వాహానాలు, మ్యాన్‌పవర్ మొత్తాన్ని ఉన్న పళంగా అప్పగించాల్సి ఉండగా, అప్పట్లో వ్యతిరేకతతో కుదరలేదు. కానీ మెరుగైన పారిశుద్ధ్యం అంటూ వందల కోట్ల రూపాయలను వెచ్చించి స్వచ్ఛ ఆటోలు, ఇతర యంత్రాలు, వాహానాలను బల్దియా నిధులతో కొనుగోలు చేసి, ఇపుడు అప్పనంగా రాంకీకి అప్పగించేందుకు యత్నించటం పట్ల ప్రస్తుతం కూడా పలు యూనియన్ల నేతలు, ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, నగరంలోని సుమారు 6వేల కిలోమీటర్ల పొడువున బీటీ రోడ్లు, మరో మూడు వేల కిలోమీటర్ల పొడువున సీసీ రోడ్లలో తొలి దశగా 709 కిలోమీటర్ల పొడువున రోడ్ల నిర్వాహణ బాధ్యతలను ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. మరో ముప్పై నుంచి 40రోజుల్లో ఈ నిర్వాహణ బాధ్యతలు ప్రారంభించేందుకు ప్రైవేటు సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

No comments:

Post a Comment