విశాఖపట్టణం, డిసెంబర్ 24 (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న కీలకమైన నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు. దీనికి కోస్తాలో రెండు జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక సినీ పరిశ్రమ అయితే గతానికి భిన్నంగా జగన్ కి ఫుల్ సపోర్ట్ అంటోంది. సినీ ప్రముఖుడు, మెగాస్టార్ చిరంజీవి అయితే జై జగన్ అనేశారు. జగన్ ముందు చూపుతో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నారు. సినీ పెద్దగా చిరంజీవి ఈ మాట చెప్పడం అంటే సినిమా రంగం మెజారిటీ మద్దతు జగన్ కే అన్నది అర్ధమవుతోంది. దీని వెనక అనేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు . ఉమ్మడి ఏపీలోనే విశాఖలో పెద్ద ఎత్తున భూములను సినీ ప్రముఖులు కొన్నారు. విశాఖ సాగరతీరంలో పెద్ద ఎత్తున సినిమా నటులు, దర్శకులు, ఇతర రంగాల ప్రముఖులు ఎకరాలకు ఎకరాలు కొన్నారు. ఇక్కడ స్టూడియోలు కట్టాలని కూడా కొంతమంది అప్పట్లో ప్రయత్నాలు కూడా చేశారు.
విశాఖకు టాలీవుడ్ తరలిరానుందా...
అయితే విభజన తరువాత పొలిటికల్ సీన్ పూర్తిగా మారడం, ఏపీలో కష్టాల్లో కూరుకుపోవడంతో హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. కానీ వారి భూములు మాత్రం భద్రంగా విశాఖలో ఉన్నాయి. ఇపుడు ఇక్కడే ఏపీ రాజధాని అంటే సినీ ప్రముఖుల భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని అంటున్నారు.సరిగ్గా సినీ ప్రముఖుల భూములకు కడు సమీపంలోనే ఏపీ రాజధానిని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగడంతో టాలీవుడ్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయట. ఈ పరిణామాలతో ఎన్నడూలేని విధంగా వారంతా జై జగన్ అనేస్తున్నారట. ఎపుడో 20 ఏళ్ళ క్రితం రామానాయుడు కాపులుప్పాడలో స్టూడియో కట్టారు. అనవసరంగా కట్టామని ఇప్పటివరకూ బాధపడిన వారికి విశాఖలో రాజధాని ఏర్పాటు అతి పెద్ద శుభవార్తగా ఉందని అంటున్నారు. ఇక మరో ప్రముఖుడు దివంగత అల్లు రామలింగయ్యకు పదెకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. అలగే ఎంతో మంది నటులకు ఇక్కడ భూములు ఉన్నాయి. ఇవన్నీ నిన్నటి వరకూ మట్టిగానే ఉన్నాయి. ఇపుడు ఒక్కసారిగా బంగారమైపోయాయి అని సంబరపడుతున్నారు.విశాఖలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నది ఈనాటి ఆలోచన కాదు. 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వచ్చిన ఆలోచన. అప్పట్లో మద్రాస్ నుంచి హైదరాబాద్ కి సినీ పరిశ్రమ షిఫ్ట్ అవుతోంది. అదే టైంలో అన్ని రకాలుగా ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతంగా విశాఖ ఉంది. దాంతో విశాఖలో చిత్ర సీమ తరలివచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అడిగిన వారికి అడిగినట్లుగా భూములు ఇచ్చాయి. ఇపుడు వారికి అవి కలసివచ్చే అవకాశం ఉంది. ఎటూ రాజధానిని విశాఖకు తరలిస్తున్న వైసీపీ సర్కార్ ఇపుడు పనిలో పనిగా సినీ సీమను కూడా విశాఖలో ఏర్పాటు చేస్తే అభివ్రుధ్ధి శరవేగంగా సాగుతుందని అంటున్నారు. టాలీవుడు సందడి చూస్తూంటే సాగర తీరానికి తార తోరణం తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
No comments:
Post a Comment