Breaking News

02/12/2019

ఆదుకోని రైతు బంధు (మెదక్)

మెదక్, డిసెంబర్ 02 (way2newstv.in): 
పంటల సాగు నిమిత్తం ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సహాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయినా రూ.11 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ప్రస్తుతం రబీ సీజన్‌ మొదలు కాగా, పంట పెట్టుబడికి డబ్బులు అవసరం. పథకం కింద రైతులకు ఎకరాకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రూ.8వేలు సర్కారు సహాయం చేస్తోంది. వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో ఎక్కువగా రైతులు వరి పంటను సాగు చేస్తుంటారు. తర్వాత మొక్కజొన్న, జొన్న, పత్తి, చెరకు తదితర పంటల సాగుపై దృష్టిసారిస్తారు. వర్షాలు లేక గతేడాది జిల్లాలో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దీంతో రైతులు రబీ సీజన్‌లో బోర్ల కింద పంటలను సాగు చేశారు. భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడంతో పంటలు ఎండిపోయి అన్నదాతకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. 
ఆదుకోని రైతు బంధు (మెదక్)

గత రబీలో 66,900 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించగా... ఇటీవల ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌ ద్వారా 2.58 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 2.04 లక్షల మంది రైతులకు రూ.188.66 కోట్ల పెట్టుబడి  సహాయాన్ని అందజేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 1.72 లక్షల మందికి రూ.164.17 కోట్లు అందజేశారు. ఇంకా 11.05 కోట్లు అందాల్సి ఉంది. గత నెల రోజుల పైగా 9,186 మంది రైతులకు సహాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అక్టోబరుతో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. ప్రస్తుతం రబీ సీజన్‌ ప్రారంభమైనా ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యాచరణను ప్రకటించకపోవడంపై విమర్శలు  వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో భూదస్త్రాల ప్రక్షాళనలో భాగంగా చాలా మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందాయి. ఈ సీజన్‌లో సహాయం అందుతుందని వారు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో 1.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో దాదాపు 1.10 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిగిలిన విస్తీర్ణంలో శనగ, వేరుసెనగ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే వరి నారు పోసే ప్రక్రియ కొన్ని చోట్ల మొదలైంది. దీంతో పంట పెట్టుబడికి సహాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment