Breaking News

22/11/2019

జగన్ నుటెన్షన్ పెడుతున్న ఎంపీలు

న్యూఢిల్లీ, నవంబర్ 22, (way2newstv.in)
రాజకీయాల్లో ఎపుడూ నిశ్చింతగా ఉండలేరు. ఎందుకంటే ఏ క్షణం ఆదమరచినా పొంచి ఉండే ప్రమాదాలు ముంచేస్తాయి కాబట్టి. పదేళ్ళ రాజకీయ జీవితంలో డక్కామెక్కీలు తిన్న జగన్ కి ఇపుడు అన్ని విషయాలూ బాగా తెలుసు. పైగా 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో జనం అతి పెద్ద బాధ్యత నెత్తిన పెట్టాక జగన్ వంటి అధినేతకు నిద్ర పడుతుందా అంటే చెప్పడం కష్టమే. అతి ఎపుడు అనర్ధమే అంటారు. సింపుల్ మెజారిటీకి మించి రెట్టింపు బలం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉంది. దాంతో తన ఎమ్మెల్యేలతో మాట్లాడడమే గగనంగా మారుతోంది. ఇక ఎంపీలు ఏంచేస్తున్నారో కూడా చూసుకునే వెసులుబాటు ఉండదేమో. ఢిల్లీలో పార్టీ నినాదాన్ని భుజానికెత్తుకుని పార్లమెంట్ ని గడగడలాడిస్తారనుకుంటారు కానీ అక్కడ ఏ కేంద్ర మంత్రితో మంతనాలు జరుపుతున్నారో మరే జాతీయ పార్టీ నాయకుడితో భేటీ అవుతున్నారో ఎవరికి ఎరుక. 
జగన్ నుటెన్షన్ పెడుతున్న ఎంపీలు

అందుకే జగన్ ఎప్పటికపుడు అలెర్ట్ అవుతున్నారుట. తన ఎంపీలు ఎవరిని కలిసినా కూడా వెంట పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తప్పకుండా ఉండాల్సిందేనని కండిషన్ పెట్టేశారు.ఇదే ఇపుడు తెలుగు రాజకీయాల్లో చర్చగా ఉంది. ఓ వైపు టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దీని మీద మాట్లాడుతూ జగన్ లో అభద్రతాభావం పెరిగిపోతోందని హాట్ కామెంట్స్ చేసారు. జగన్ పార్టీకి చెందిన ఎంపీలు సర్దుకుంటున్నారని, ముందు ఆ సంగతి చూసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది నిజమేనా అన్న సందేహాలు కూడా వైసీపీ వర్గాల్లో కలుగుతున్నాయట. నిప్పు లేనిదే పొగ రాదని అంటారు. జగన్ కి ఢిల్లీ రాజకీయ పరిణామాలు, తన పార్టీ ఎంపీల పోకడలు తెలిసే ఇలా హెచ్చరికలు జారీ చేశారా అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి ఇపుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, కండువా కప్పుకోవడం సులువైన వ్యవహారమైపోయింది. గతంలో అయితే ఇది సంచలనం. ఇపుడు పార్టీ మారకపోతేనే విడ్డూరం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాజకీయాల్లోకి వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు ప్రవేశించాక లాభం నష్టం తూనిక రాళ్ళే చూస్తున్నారు తప్ప నైతిక విలువల కొలమానాలు లేవన్నది తెలిసిందే. అందుకే జగన్ తన ఎంపీల విషయంలో ముందుగానే జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.ఏపీలో బీజేపీ గట్టిగా వేళ్ళూనుకోవాలనుకుంటోంది. దాని కోసం పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ ఆకార్ష్ కి పెద్దగా స్పందన రావడంలేదు. దాంతో ఎంపీలు, ఎమ్మెల్యేలనే లాగేస్తే వారి వెనకాలే నాయకులు కూడా కదలివస్తారని ఆలోచన చేస్తోంది. ఎమ్మెల్యేల వరకూ టీడీపీ మీద గురి పెట్టిన బీజేపీ ఎంపీల దగ్గరకు వచ్చేసరికి వైసీపీ వైపు చూస్తోందని అంటున్నారు. నిజానికి బీజేపీకి లోక్ సభలో సరిపోయినంతమంది ఎంపీలను జనం ఇచ్చారు.ఏపీ రాజకీయాల్లో పాగా వేయాలంటే వల వేయాల్సిందేనని బీజేపీ వ్యూహ కర్తలు భావిస్తున్నారుట. దాంతోనే వైసీపీ ఎంపీలను దువ్వుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎంపీలు కొందరు బీజేపీ టచ్ లోకి వెళ్ళారని టాక్ నడుస్తోంది. ఈ విషయాలు తెలియబట్టే జగన్ అప్రమత్తం అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా భారీ మెజారిటీతో గెలిచినా కూడా జగన ని అభద్రతాభావం వెంటాడుతోంది అంటే అది రాజకీయాల పుణ్యమా లేక నైతిక విలువల పతనమా అన్నది ఆలోచించాలని అంటున్నారు.

No comments:

Post a Comment