Breaking News

07/11/2019

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి చర్యలు

ఒంగోలు, నవంబర్ 07,(way2newstv.in):
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారని రాష్ట్ర అటవి,విద్యుత్, శాస్త్రసాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.గురువారం స్థానిక ఒంగోలు ఎన్.టి.ఆర్.కళా క్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులను రాష్ట్ర అటవి,విద్యుత్,శాస్త్రసాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్ధ పేద ప్రజల నుండి రూ.వేల కోట్ల డిపాజిట్లకు అధిక వడ్డి ఇస్తామని ఆశ చూపి వసూలు  చేశారన్నారు. రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుండి  అగ్రిగోల్డ్ బాధితులు ధర్నాలు చేసి అరెస్ట్ లు అయ్యారని  ఆయన తెలిపారు. 
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి  చర్యలు

అగ్రిగోల్డ్ బాధితులను అదుకుంటామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్  రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వం వచ్చిన వెంటనే  మొదటి మంత్రి వర్గ సమావేశంలో రూ.1,150 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి  దశలో పదివేల రూపాయలు డిపాజిట్ చేసిన బాధితులకు నష్టపరిహారం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్  బాధితులకు ఆదుకోవడానికి  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అగ్రిగోల్డ్ సంస్థ రాష్ట్రంలోనే కాక  ఇతర దేశాల్లో కూడా 32 లక్షల మంది నుంచి రూ.6 వేల 380 కోట్లు సేకరించడం జరిగిందని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలకు అధిక వ్డడి ఇస్తామని, భూములు రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రజల వద్ద డిపాజిట్లు సేకరించి వారిని సంస్థ మోసగించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను  ఆదుకోవడానికి బడ్జట్ లో రూ.1,150 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లాలో అగ్రిగోల్డ్  బాధితులు 26 వేల 586 మందికి రూ.19,11,50,904లు  నష్ట పరిహారం అందించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. మొదటి విడతగా అగ్రిగోల్డ్ సంస్ధలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారిని మొదటిగా గుర్తించిందన్నారు. నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు ఈ రోజు నష్టపరిహారం జమ చేస్తున్నామని ఆయన తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు, జిల్లా ఎస్.పి. సిద్ధార్ధ్ కౌశల్, కొండేపి నియోజకవర్గ ఇన్ ఛార్జి డాక్టర్ ఎమ్.వెంకయ్య, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఒంగోలు నగరపాలక సంస్థ కమీషనర్ నిరంజన్ రెడ్డి, జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు సింగరాజు  వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment