తిరుమల, నవంబర్ 6 (way2newstv.in)
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆలయ ప్రవేశానికి మార్గం సుగమమైంది. సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత ఆయన శ్రీవారి కైంకర్యాల్లో పాల్గొన్నారు. రమణ దీక్షితులను ఆగమ శాస్ర్త సలహామండలి సభ్యుడిగా అవకాశం కల్పించింది. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు కూడా టీటీడీ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన కుమారులు వెంకట కుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పున:ప్రవేశం కల్పించింది.
ఏడాదిన్నర తర్వాత స్వామివారి సేవలో రమణదీక్షితులు
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా టీటీడీలో అరాచకాలు జరిగాయని ఆరోపణలు చేయడంతోపాటు స్వామివారి వజ్రాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోటులో తవ్వకాలు జరిపారని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో గత ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా కూడా వేసింది.రమణ దీక్షితులను ఆగమ శాస్ర్త సలహామండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తూ గత నెల 23న జరిగిన టీటీడీ పాలకవర్గ సమావేశంలోనే తీర్మానించినట్లు సమాచారం. గత ప్రభుత్వం దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడంతో దీక్షితులు రీఎంట్రీ లాంఛనమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీటీడీ జేఈవో ధర్మారెడ్డిని కలిశారు.అయితే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి రేగడంతో రమణ దీక్షితులును తెరపైకి తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎస్‌గా ఉన్న ఎల్వీని అనూహ్యంగా అప్రాధాన్య పోస్టు అయిన మానవ వనరుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేయడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం రమణ దీక్షితులకు శ్రీవారి ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment