Breaking News

06/11/2019

వివాదమౌతున్న ఎల్వీ బదిలీ

విజయవాడ, నవంబర్ 6 (way2newstv.in)
రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ ప్రజాస్వామ్యంలో పెడ పోకడలకు దారి తీస్తుంది. సంయమనం, సమతుల్యత సాధిస్తూ వ్యవహారాలను చక్కబెట్టగలిగినప్పుడే విస్తృత ప్రజాప్రయోజనం సమకూరుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసిన ఉదంతం బ్యూరోక్రసీతోపాటు ప్రజల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇది పార్టీల చేతిలో రాజకీయాస్త్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారయంత్రాంగంతో రాజకీయ కార్యనిర్వాహక వర్గం పనిచేయించే విధానంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులదే తుది తీర్పు. అందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండవు. అందుకే సీనియర్ బ్యూరోక్రాట్లు సైతం అభిప్రాయభేదాలున్నప్పటికీ పొలిటికల్ బాస్ లు చెప్పిన దానినే చివరికి అమలు చేస్తారు. 
వివాదమౌతున్న ఎల్వీ బదిలీ

ముఖ్యమంత్రి ఆలోచనలు గ్రహించి అందుకనుగుణంగా వ్యవహరిస్తుంటారు.ప్రభువును మించిన ప్రభు భక్తి ప్రదర్శించడంలో బ్యూరోక్రసీ ఎప్పుడో తలపండి పోయింది. మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఎలా వచ్చాయన్నదే ప్రశ్న. కనీసం 30 నుంచి 35 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే తప్ప ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకోరు. జిల్లాలో సబ్ కలెక్టర్ స్థాయి నుంచి అనేక రకాల పదవులు నిర్వహిస్తూ డక్కామొక్కీలు తింటూ అధికార సోపానపటంలో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరుకుంటారు. ఈ కాలవ్యవధిలో వందలమంది రాజకీయనేతలను చూస్తుంటారు. ప్రభుత్వాలు సైతం మారిపోతుంటాయి. సాధారణంగా అధికారులు తమ పరిధిలో నూతన ప్రభుత్వ అధినేత చెప్పినట్లు నడుచుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఎన్నికల సమయం నుంచే వారి అజెండాలను అధికారులు శ్రద్ధగా అధ్యయనం చేస్తుంటారు. అధికారపార్టీ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏవిధంగా నిధులను సర్దుబాటు చేయాలనే విషయంపై కూడా అధికారులే కసరత్తు చేస్తారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులది ఆలోచన అయితే దానిని ఆచరణాత్మకం చేయాల్సింది బ్యూరోక్రసీనే. అయితే ప్రజాప్రతినిధులు తమను గద్దెపైకి ఎక్కించిన ప్రజలకు ఏరకంగానైనా మేలు చేయాలనుకుంటారు. నిబంధనలు, నియమాల వంటివి వారికి పెద్దగా పట్టవు. చట్టపరమైన నియమాలు అంగీకరించకపోయినా కొన్నిసార్లు పంతానికీ పోతుంటారు.అధికారులు భవిష్యత్ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆచితూచి వ్యహరిస్తుంటారు. కొందరైతే నిబంధనల చట్రాన్ని తమకు తాముగా బిగించుకుంటూ ఉంటారు. ఇక్కడే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడతాయి. తాము చెప్పింది చేసి తీరాల్సిందేనని ప్రజాప్రతినిధులు మంకు పట్టుపడుతుంటారు. దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఏకరవు పెడుతూ కొర్రీలు వేస్తుంటారు అధికారులు. కానీ చాలామంది ‘ఎస్..బాస్’ అని ఫాలో అయిపోతూ ఉంటారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రితో నెలకొన్న విభేదం తీవ్రమైన విషయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాధారణ బ్యూరోక్రాట్ గా వ్యవహరించలేరు. ప్రభుత్వ యంత్రాంగానికి అధినేతగా, కేబినెట్ కు కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి అధికారిక సలహాదారుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సమన్వయ బాధ్యత కూడా ప్రధాన కార్యదర్శిదే. అందువల్లనే వ్యవస్థ తప్పుదారి పట్టకుండా చూసుకోవడం, కింది స్థాయి అధికారులు తప్పు చేయకుండా నియంత్రించడం, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నిరోధించడం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు. ఈ క్రమంలో ఏర్పడిన సంఘర్షణే ప్రధాన కార్యదర్శి బదిలీకి దారితీసిందనేది అధికారవర్గాల సమాచారం. ప్రధాన కార్యదర్శి కి సమాంతరంగా మరో అధికారితో పాలనయంత్రాంగాన్ని నడపాలనుకోవడం పై నెలకొన్న విభేదం పతాకస్థాయికి చేరి బదిలీకి దారి తీసింది. ప్రధాన కార్యదర్శి మాటకు ముఖ్యమంత్రులు ఎంతో గౌరవం ఇచ్చేవారు. వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉండేవారు. కానీ దశాబ్దకాలంగా చీఫ్ సెక్రటరీ అధికారాలు పలచబారుతూ వస్తున్నాయి. సలహాదారుల వ్యవస్థ రావడం, ముఖ్యమంత్రులు తమకు ఇష్టమైన అధికారులను పేషీల్లో నియమించుకుని వారికి స్వేచ్ఛ కల్పించడంతో ప్రధాన కార్యదర్శి నామమాత్రంగా మిగిలిపోతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో సంబంధం లేకుండా దిగువస్థాయి అధికారులే నేరుగా అన్నిశాఖలకు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి వస్తే దిక్సూచిగా ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిందే. ఆ కోణం నుంచి చూస్తే తాజా బదిలీ పరాకాష్టగానే పేర్కొనాలి. ముఖ్యంగా మాట వినని అధికారులను దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఈ బదిలీ ద్వారా ఒక హెచ్చరిక పంపడానికి ప్రయత్నించిందనుకోవాలి. అయితే గుడ్డిగా ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతిపనీ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో న్యాయపరమైన , చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఎన్నికల వంటి క్రిటికల్ సమయంలో బాధ్యతలు స్వీకరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ పథకాలు పట్టాలెక్కించాల్సిన కీలక సమయంలో నిష్క్రమించారు. బదిలీ సందర్భంగా హిందూ ఆలయ ఉద్యోగాల నుంచి అన్యమతస్థులను తొలగించే విషయంలో ప్రధానకార్యదర్శి కఠినంగా ఉండటంతోనే ఆయనపై వేటు పడిందనే ప్రచారం ఉద్ధృతమైంది. ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే ప్రభుత్వానికి జరిగే పొలిటికల్ డామేజీ చాలా ఎక్కువగా ఉంటుంది. వైసీపీ పార్టీపైన, ప్రభుత్వం పైన దీర్ఘకాల పర్యవసానాలకూ ఆస్కారం ఏర్పడుతుంది

No comments:

Post a Comment