Breaking News

03/10/2019

అచ్చం నాన్నలానే... తూర్పు సెంటిమెంట్ లో జగన్

కాకినాడ, అక్టోబరు 3, (way2newstv.in)
బాపూజీ కలలు కన్నది గ్రామ స్వరాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ ఆయన కోరుకున్న రాజ్యం అధికార కేంద్రీకరణ గా మారుతూ వస్తుంది. ఎన్నికల ముందు ప్రతీ పార్టీ బాపూజీ కలలు కన్న స్వరాజ్యం ప్రజలకు అందిస్తామని ముఖ్యంగా గ్రామీణ వికాసం మా లక్ష్యమని చెప్పుకోవడం ఓట్లు పడ్డాకా మరచిపోవడం రివాజుగానే వస్తుంది. అయితే తెలంగాణ లో ఉవ్వెత్తున ఉద్యమం రూపుదాలుస్తున్న తరుణంలో ఆ ఉద్యమానికి చెక్ పెట్టేందుకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆలోచన చేశారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో సర్వ అధికారాలను కట్టబెడితే ఎలా ఉంటుంది అన్నదే ఆయన ఆలోచన. నిధులు విధులు గ్రామ స్థాయిలోనే స్థానికులే నిర్వహించుకునేలా కేంద్ర, రాష్ట్రాల పెత్తనం వారిపై లేకుండా ఉంటే ప్రాంతీయ ఉద్యమాలు రూపుదాల్చే అవకాశాలు ఉండవని ఆయన భావించినట్లు వైఎస్ కి సన్నిహితులైన ఉండవల్లి అరుణకుమార్ వంటివారు చెబుతూ ఉంటారు.
అచ్చం నాన్నలానే... తూర్పు సెంటిమెంట్ లో జగన్

తండ్రి కలలు కన్న ఆ విధానం ఆయన అమలు చేయకుండానే అర్ధారంతరంగా నిష్క్రమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన జగన్ అది అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తుంది. గ్రామ సచివాలయాలు, గ్రామవాలంటీర్ల నియామకం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో నవ ముఖ్యమంత్రి అడుగులు వేసేందుకు సిద్ధం అయ్యారు. నాలుగు నెలల పాలన తరువాత ప్రజల నుంచి సర్కార్ కి మిశ్రమ స్పందనే లభిస్తుంది. దాంతో ఆయన ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందించే వ్యవస్థను ఆరంభిస్తున్నారు. ఇది సత్పలితాలను ఇస్తే దేశవ్యాప్త చర్చకు దారి తీయడంతో బాటు అనేక చోట్ల అమలు చేసే అవకాశం కూడా వుంది.స్వర్గీయ వైఎస్ కు ఏ కొత్త కార్యక్రమం అయినా తూర్పు గోదావరి నుంచి శ్రీకారం చుట్టడం సెంటిమెంట్ గా ఉండేది. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ సైతం అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరప గ్రామ సచివాలయం నుంచి ఆయన వైసిపి సర్కార్ ప్రతిష్టాకరమైన వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకోసం గాంధీజీ జయంతిని ప్రభుత్వం ఎంపిక చేసుకోవడం విశేషం. సుమారు 500 ల పథకాలను ముఖ్యంగా 34 రకాల సేవలను నేరుగా ప్రజలు పొందేందుకు రూపొందించిన ఈ కొత్త కార్యక్రమం అమలు పైనే రానున్న రోజుల్లో వైసిపి కి మార్కులు పడనున్నాయన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో సర్కార్ గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరుపై నిరంతర నిఘా కొనసాగించాలిసిందే. ఏ మాత్రం తేడా వచ్చినా అది అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే.

No comments:

Post a Comment