Breaking News

11/10/2019

పెద్దరికాన్ని నిలుపుకోలేక... అపోసోపాలు

హైద్రాబాద్, అక్టోబరు 11, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టి రెండు మూడేళ్ళు అయివుంటాయేమో చంద్రబాబు విద్యార్ధి రాజకీయ జీవితం ప్రారంభమైంది. జగన్ పారాడేనాటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తరువాత మంత్రి కూడా అయ్యారు. ఇక జగన్ యుక్తవయసులో ఉన్నపుడు ఆయన మామ ఎన్టీయార్ ని గద్దె దించి ఉమ్మడి ఏపీకి సీఎం అయిపోయారు. ఇక జగన్ 2009లో తొలిసారి ఎంపీగా పోటీ చేసేనాటికే చంద్రబాబు రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్ష నేతగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఆ తరువాత మూడు నెలలకే తండ్రి చనిపోవడంతో జగన్ ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పటికి జగన్ కి 36 ఏళ్ళు అనుకుంటే ఆయన్ని అన్ని విధాలుగా మించిన నేతగా చంద్రబాబు ఉన్నారు. 
పెద్దరికాన్ని నిలుపుకోలేక... అపోసోపాలు

మరి నాటి నుంచి నేటి వరకూ చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు అయిన చంద్రబాబు తన పెద్దరికాన్ని నిలుపుకుటున్నారా అంటే సమాధానం అసంత్రుప్తిగానే వస్తుంది.మాటకు వస్తే చాలు చంద్రబాబు పులివెందుల రాజకీయం, పులివెందుల పంచాయతీ, పులివెందుల రౌడీలు అంటూంటారు. పులివెందులలో ఒక్క జగనే పుట్టారా? అక్కడ లక్షలాది మంది జనం లేరా? మరి వారిని బాబు రౌడీలు అని అనడం ఎంతవరకూ సబబు. జగన్ తో రాజకీయ విభేదాలు ఉంటే ఆయన్ని నిందించడం వరకూ ఒకే. కానీ పులివెందుల ఏం పాపం చేసింది. అందులో ఆడవారు, వృధ్ధులు, పిల్లలు, మేధావులు, చదువరులు ఇలా అన్ని వర్గాల జనం ఉంటారు. అందరికీ కలిపేసి పులివెందుల రౌడీలు అని విమర్శలు చేయడం చంద్రబాబు వంటి సీనియర్ కి తగునా అన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న మాట.జగన్ పాలన నేరగాడి పాలన అని చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇది కూడా చంద్రబాబు వంటి నేత నోటి నుంచి రావాల్సిన మాట కాదేమో. జగన్ నేరస్తుడు అని ఏ కోర్టూ ఇప్పటివరకూ నిర్ధారించలేదు. ఆయన మీద కేసులు ఉన్నాయి. అవి కూడా ఆర్ధికపరమైనవి. మరి అన్నీ తెలిసిన చంద్రబాబు జగన్ ని నేరస్థుడు అంటున్నారు. ఆయన పాలన రౌడీ రాజ్యం అంటున్నారు. జనం ఈ పాలనను క్షమించరు అని కూడా అంటున్నారు. మరి ఇన్ని చెబుతున్న చంద్రబాబు అదే జనం బంపర్ మెజారిటీతో జగన్ ని గెలిపించిన సంగతిని ఎందుకు మరచిపోతున్నారన్న ప్రశ్న వస్తోంది. ప్రజల తీర్పుని ప్రజాస్వామ్యంలో ఎవరైనా భరించాల్సిందే. శిరసు వంచి సహించాల్సిందే. మరి చంద్రబాబు దానికి విరుధ్ధంగా తరచూ జగన్ ని నేరస్తుడు అనడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న పార్టీని, పాలనను కించపరుస్తున్నారని అంటున్నారు. విశాఖలో జరిగిన టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఇదే వైఖరితో ముందుకు వెళ్తరా లేక ధోరణి మార్చుకుంటారా అన్నది చూడాలి.

No comments:

Post a Comment