Breaking News

26/10/2019

కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు

హైద్రాబాద్, అక్టోబరు 26, (way2newstv.in)
సైబర్ నేరగాళ్లు  కొత్త తరహా మోసాలకుపాల్పడుతూ ప్రజలను నిలువునా ముంచుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకొని సిటీజనులు మోసపోతున్నారు. సెకండ్‌హ్యాండ్‌ సేల్స్‌ పేరుతో ఓఎల్‌ఎక్స్‌ వేదికగా దగా చేయడం, బ్యాంకు అధికారులఅవతారమెత్తి ఓటీపీ సంగ్రహించి టోకరా వేయడం, జాబ్స్‌/వీసాల పేరుతో దండుకోవడం, లాటరీ/రుణాల పేరుతో అందినకాడికి దోచుకోవడం, సోషల్‌ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతూ డిమాండ్‌ చేయడం... ఇలా వినూత్న మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు పంజావిసురుతున్నారు. ఈ కేటగిరీ క్రైమ్స్‌లో ఈ ఏడాది  ఆగస్టు వరకు సిటీలో 720 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 198 ‘ఓఎల్‌ఎక్స్‌’ ఫ్రాడ్స్‌ ఉన్నాయి. 
కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు

గతంలో ఓటీపీ క్రైమ్‌ ఎక్కువగా నమోదు కాగా... ఇప్పుడా స్థానంలో ‘ఓఎల్‌ఎక్స్‌’ చేరింది. ఈ ఈ–కామర్స్‌ సైట్‌లో ఆర్మీ ఉద్యోగుల పేరుతో పోస్టింగ్స్‌ పెట్టి, సెకండ్‌హ్యాండ్‌ వస్తువుల్ని అతి తక్కువ ధరకు విక్రయిస్తామంటూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారు. భరత్‌పూర్‌ ఈ ఓఎల్‌ఎక్స్‌ నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ–కామర్స్‌ సైట్స్‌లో కార్లను తక్కువ ధరకు అమ్ముతామంటూ పోస్టులు పెట్టి, అడ్వాన్స్‌గా కొంత మొత్తం డిపాజిట్‌ చేయించుకొని మోసం చేసే ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని వివరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని సైట్స్‌లోనూ ఖాతాలు తెరిచి పోస్టింగ్స్‌ పెడుతున్న ఈ కేటుగాళ్లు ఆర్మీ ఉద్యోగుల పేర్లు వాడుకుంటున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన వారి ఫొటోలతోనే పోస్టింగ్స్‌ చేస్తున్నారు. వాటిలో బుల్లెట్‌తో పాటు వివిధ రకాలైన కార్ల ఫొటోలను పొందు పరుస్తున్నారు. తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయినందుకో, రిటైర్డ్‌ అయిన నేపథ్యంలోనే ఆయా వాహనాలను అమ్మి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నామంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆర్మీ దుస్తుల్లో దిగిన ఫొటోలనూ పోస్ట్‌ చేసి మరింత నమ్మకం కలిగిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.50వేలు, కార్లకు రూ.2 లక్షల వరకు రేట్లు పొందుపరుస్తున్నారు. ప్రజలు తేలిగ్గా నమ్ముతారనే ఉద్దేశంతోనే ఆర్మీ పేరు వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా వాహనాల యజమానులు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వెహికల్‌ ఎయిర్‌పోర్ట్‌ పార్కింగ్‌లో ఉందంటూ చెబుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపించి వారిచ్చిన నంబర్లలో సంప్రదిస్తే వాహనాలను చూపించాలన్నా, డెలివరీ ఇవ్వాలన్నా అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలని కోరుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ వాలెట్స్‌లోకి ఆ నగదు బదిలీ చేయించుకొని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేస్తున్నారు. విదేశాల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం అనేక మంది కల. ఇప్పుడు దీన్ని క్యాష్‌ చేసుకునే ముఠాలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా విదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లు ఇంటర్‌నెట్‌పై ఆధారపడతారు. అనేక వెబ్‌సైట్లు, బ్లాగులను సెర్చ్‌ చేయడంతో పాటు మరికొన్నింటిలో తమ ప్రొఫైల్స్‌ పొందుపరుస్తూ ఉంటారు. ఇవన్నీ సైబర్‌ నేరగాళ్లకు కలిసొచ్చే అంశాలుగా మారిపోతున్నాయి. ఆయా వెబ్‌సైట్స్‌ నుంచి సమాచారం సంగ్రహిస్తున్న నేరగాళ్లు విదేశీ విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. నేరుగా కాల్స్‌ చేయడమో, ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్‌ పంపడమో చేస్తున్నారు. వీటికి ఎదుటివారు స్పందిస్తే తమ ‘పని’ ప్రారంభిస్తున్నారు. ఫలానా వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ చూశామని, తాము అందించే ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెబుతుంటారు. విద్యార్థులకైతే ఆయా దేశాల్లో  ఉన్న ప్రముఖ యూనివర్సిటీలతో తమకు సంబంధాలున్నాయని, ప్రతిఏటా కొన్ని సీట్లు రిజర్వ్‌ చేసి మరీ వాటిని భర్తీ చేసే అవకాశం నిర్వాహకులు తమకు ఇచ్చారని పేర్కొంటారు. ఆపై అడ్వాన్స్‌లు, వీసా ప్రాసెసింగ్‌ ఫీజులు, పన్నుల పేర్లు చెప్పి డబ్బు తమ బ్యాంకు ఖాతాల్లోకో, వాలెట్స్‌లోకో బదిలీ చేయించుకొని మోసం చేస్తుంటారు. ఒకసారి డబ్బు ముట్టిన తర్వాత బాధితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరిని సంప్రదించడం సాధ్యం కాదు. ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న సైబర్‌ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం అంత కష్టం. ఈ కేసుల్లో రికవరీలు దాదాపు అసాధ్యంగా మారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులతో లావాదేవీలు చేయొద్దు. పరిచయం లేనివారు చెప్పిన మాటలు నమ్మి ఒక్క రూపాయి కూడా కోల్పోవద్దు. ఈ నేరగాళ్లు వినియోగించే సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, వాలెట్స్‌ బోగస్‌ వివరాలతో పొందినవై ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు. సైబర్‌ నేరాల విషయంలో ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యార్‌’ అనే నానుడి కచ్చితంగా పాటించాలి. ఏ వస్తువైనా వాటి విలువ కంటే తక్కువ ధరకు మార్కెట్‌లో దొరకదని, బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని, ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ ఆధారంగా ఉద్యోగాలు, విద్యావకాశాలు రావని గుర్తుంచుకోవాలినగర సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల్లో లాటరీ/లోన్‌ ఫ్రాడ్స్‌ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ నేరాలకు పాల్పడే నిందితులు వివిధ మార్గాల్లో బల్క్‌గా ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్స్‌ సంపాదిస్తున్నారు. డార్క్‌ వెబ్‌తో పాటు ఇంటర్‌నెట్‌లోనూ నామమాత్రపు ధరకు ఈ డేటాను అందించే సైట్లు అనేకం ఉన్నాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రముఖ సంస్థల పేర్లతో లాటరీ తగిలిందని, తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామంటూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్‌తో ‘విరుచుకుపడతారు’. ఎవరైనా స్పందిస్తే వారిలో నమ్మకం కలగడానికి ఆయా సంస్థల పేర్లు, లోగోలతో కూడిన సర్టిఫికెట్లను సైతం ఈ–మెయిల్‌/వాట్సాప్‌ ద్వారా బాధితులకు పంపిస్తారు. ఆ మొత్తం మీకు చేరాలంటే జీఎస్టీ మొదలు అనేక పన్నులు చెల్లించాలని చెప్పి తమ ఖాతాలు/వాలెట్స్‌లో వేయించుకొని మోసం చేస్తారు. ఈ నేరగాళ్లు అనేక సందర్భాల్లో మీరు డిపాజిట్‌/ట్రాన్స్‌ఫర్‌ చేసే ప్రతి పైసా లాటరీ మొత్తం లేదా రుణంతో కలిపి తిరిగి వచ్చేస్తుందని నమ్మిస్తారు. ఈ రెండు రకాలైన మోసాలతో పాటు ఇప్పటికీ బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత వివరాలతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ (ఓటీపీ) సంగ్రహించి మోసం చేస్తున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోషల్‌ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలూ అనేకం పోలీసు రికార్డులకు ఎక్కుతున్నాయి.

No comments:

Post a Comment