Breaking News

28/10/2019

చెరువులు మాయం (వరంగల్)

వరంగల్, అక్టోబర్ 28 (way2newstv.in): 
మహా నగరంలో చెరువుల స్థలాలపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా చదును చేసేస్తున్నారు. ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి చెరువుల అనవాళ్లే లేకుండా పోతున్నాయి. పోయినవి సరే.. కనీసం ఉన్న వాటినైనా రక్షించేందుకు ప్రభుత్వ శాఖల్లో సమన్వయం లేదు. చెరువు స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించినా, కార్పొరేషన్‌ ఉద్యోగులు వాటికి కొత్తగా ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగమే కబ్జాదారులకు అండగా నిలవడంతో జాగాలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా త్రినగరిలో రోజురోజుకూ భూగర్భ జలమట్టం పడిపోతోంది. తాగునీటి బావులు, బోర్లు ఎండిపోతున్నాయి.
చెరువులు మాయం (వరంగల్)

ములుగు రోడ్‌ కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లుగా రెవెన్యూ శాఖ తేల్చింది.  వరంగల్‌ ప్రాంతం దేశాయిపేటల చిన్నవడ్డేపల్లి చెరువు 100 ఎకరాల పైగా ఉండాలి. సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ శాఖ పరిశీలనలో తేలింది. హంటర్‌రోడ్‌ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 15-20 ఎకరాల వరకు ప్రైవేటు పరమైంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు ప్రైవేటు చెరలో ఉంది. కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. సగం స్థలాలు మాయం చేశారని తెలిసింది. ఎఫ్‌టీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతుండగా, కార్పొరేషన్‌ వారు ఇంటినెంబర్లు ఇస్తున్నారు. పాతబస్తీ ఉర్సు రంగసముద్రం(ఉర్సు చెరువును) 126 ఎకరాల్లో విస్తరించింది. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవన నిర్మాణాలు సాగుతున్నాయి. అమ్మవారిపేట దామెర చెరువు 134 ఎకరాల్లో విస్తరించింది. రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. తిమ్మాపూర్‌ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చేందుకు ప్రతిపాదించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. సగం స్థలాలు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు. వరంగల్‌ నగర ప్రజల తాగునీటి వరప్రదాయని భద్రకాళి చెరువు 336 ఎకరాలు ఉంటుంది. సుమారు 30 ఎకరాల పై చిలుకు కనుమరుగైంది.హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే ఈ చెరువులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది.  గొర్రెకుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఎనిమిది ఎకరాల వరకు ప్రైవేటు పరమైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. హసన్‌పర్తి పెద్ద చెరువు 157 ఎకరాలు ఉండాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పట్టా భూమి పేరుతో 30 ఎకరాల వరకు చదును చేయడం వివాదాస్పదంగా మారింది.

No comments:

Post a Comment