Breaking News

22/10/2019

పందుల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి అక్టోబరు 22, (way2newstv.in)
వనపర్తి మున్సిపాలిటీ లో ప్రజలు పందుల వల్ల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ని ఆదేశించారు.15 రోజులలో పట్టణంలో పందుల సమస్యను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో మురికి కాలువలు, రహదారులను శుభ్రంగా ఉంచటంలో వార్డుల ప్రజలు  మున్సిపాలిటీ తో సహకరించాలని ఆమె కోరారు.మున్సిపాలిటీలలో పదిహేను రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మంగళవారం కలెక్టర్ వనపర్తి మున్సిపల్ పట్టణ పరిధిలోని శ్వేతా నగర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, జంగిడిపురం తదితర వార్డులలో పర్యటించి కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. 
పందుల పై చర్యలు తీసుకోవాలి

శ్వేత నగర్ కాలనీలో చిన్న  మురికి కాలువల తోపాటు, పెద్ద మురికి కాలువ లో చెత్త, చెదారం, ప్లాస్టిక్ పదార్థాలను వేయటం వల్ల మురుగునీరు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలలో మురికి కాలువల శుభ్రం మున్సిపాలిటీ చే పడుతున్నప్పటికీ, స్థానిక రెసిడెన్షియల్ సంక్షేమ సొసైటీలు కూడా చొరవ తీసుకొని మురికి కాలువలో చెత్తను, ప్లాస్టిక్ పదార్థాలను వేయకుండా చూడాలని కోరారు. శ్వేతా నగర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లలో వెంటనే పిచ్చి మొక్కలను చెత్తను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. స్థలం యజమానులు లేనిచోట మున్సిపాలిటీ ద్వారా పనులు చేయించాలని, ముందుగా నోటీసులు జారీ చేసి, ఆపై పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. శ్వేతా నగర్ కాలనీలో ఉన్న పెద్ద మురికి కాలువ  చెట్లు, పిచ్చి మొక్కలతో మూసుకు పోగా మురుగునీరు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, అందువల్ల మున్సిపాలిటీ ద్వారా తక్షణమే కాలువను శుభ్రం చేయించాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ అందుకు అంగీకరించారు. వార్డులలో పందుల బెడద తీవ్రంగా ఉందని, ఎలాగైనా పందుల సమస్యను తీర్చాలని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.         అనంతరం జిల్లా కలెక్టర్ జంగిడిపురం వార్డును సందర్శించి అక్కడ జరుగుతున్న పదిహేను రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించారు. కాళీ స్థలాలలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని వార్డు ప్రత్యేక అధికారి మరియు షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి వెంకట స్వామి ని ఆదేశించారు. అక్కడ మున్సిపాలిటీ ద్వారా సైడ్ డ్రైన్ పరిశుభ్రం చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి తో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో పందుల బెడద ను తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని, ప్రజలు పందుల కారణంగా ఇబ్బందులు పడకుండా చూడాలని, పందుల పెంపకందారుల తో ఆర్డీవో ద్వారా సమావేశం ఏర్పాటుచేసి తక్షణమే పందులను దూరప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  ప్రత్యేక అధికారులు మత్స్య శాఖ ఏడి రాధ రోహిణి , తాసిల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.

No comments:

Post a Comment