Breaking News

05/10/2019

బాబుకు అప్పుడు అదే ప్లస్... ఇప్పుడు అదే మైనస్

విజయవాడ, అక్టోబరు 5, (way2newstv.in)
చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. జాతీయ స్థాయిలో కూడా తనదైన ముద్రని వేసుకున్నారు. ఇపుడు డెబ్బయ్యేళ్ల వయసులో చంద్రబాబు విపక్ష పాత్రలో చాలా భారంగా కనిపిస్తున్నారు. ఆయన ముందు బిగ్ టాస్క్ ఉంది. రీచ్ కాగలరా అన్న సందేహం ఆయనకే వస్తోందా అనిపిస్తోంది. ఎందుకంటే అయిదేళ్ళు అంటే కాలచక్రంలో చిన్నగా కనిపించిన చాలా మార్పులు తెస్తాయి. మరి చంద్రబాబుకు చేదోడు వాదోడుగా పార్టీలో ఉంటారంటే ఇతర నాయకులు అంతా అంగుష్టమాత్రులే కనిపిస్తున్నారు. చంద్రబాబు ఎవరినీ నమ్మకుండా అలా మరుగుజ్జుల్లా నేతలను తయారు చేశారు. ఇపుడు చంద్రబాబు ఒక్కరే శిఖరాయమానంగా ఉన్నారు. 
బాబుకు అప్పుడు అదే ప్లస్... ఇప్పుడు అదే మైనస్

ఒకనాడు ఆయనకు అది ప్లస్ గా ఉన్నా ఇపుడు అది ఒంటరితనంగా మారుతోంది. బాధ్యతలు పంచుకునే వారు లేక బాబు ఇబ్బందిపడుతున్నారని తెలిసిపోతోంది.కొత్త సర్కార్ వైసీపీ ఏర్పాటు అయి నాలుగు నెలలు గడిచాయి. జగన్ పాలనకు కొత్త. అయినా ఆయన దూకుడుగానే సాగుతున్నారు. ఇక ఆయన చేపట్టిన కార్యక్రమాలు కొన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవచ్చు కానీ జగన్ చిత్తశుద్ధిని మాత్రం జనం గమనిస్తున్నారు. ఈ యువ ముఖ్యమంత్రి ఏదో చెయాలనుకుంటున్నారని మాత్రం జనానికి అర్ధమవుతోంది. ఈ దశలో చంద్రబాబు చేస్తున్న ఉబుసుపోని ఆరోపణలను జనం పట్టించుకున్నట్లుగా లేదు. ప్రజల సమస్యలపైన పోరాడేందుకు చంద్రబాబుకు ఇంకా సమయం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఓడిపోయిన మొదటి రోజు నుంచే అధికారాన్ని కోరుకుంటాయి. కానీ ప్రజలు మాత్రం తాము ఎన్నుకున్న ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకుంటాయి. ఈ గ్యాప్ వల్లనే చంద్రబాబు చేస్తున్న విమర్శలు జనాల మెదళ్ళకు ఎక్కడంలేదు. దాంతో నాలుగు నెలల చంద్రబాబు విపక్ష పాత్ర పేలవంగా ఉందని అంటున్నారు.చంద్రబాబు అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు కానీ అసలు లోపమంతా పార్టీలోనే ఉంది. ఆ సంగతి మరచి జగన్ మీద విమర్శలు చేస్తే రాజకీయ లాభం ఉండదని అంటున్నారు. ఇక చలో ఆత్మకూరు కానీ, అన్నా క్యాంటీన్ల మీద పోరాటం కానీ, రివర్స్ టెండరింగ్ కానీ ఇలా ఏ విషయమైనా చంద్రబాబు పెద్ద గొంతు చేసుకుని చేసిన ఆరోపణలు గాలిలోనే కలసిపోయాయి. ఇప్పటికైతే చంద్రబాబు విపక్ష పాత్ర పెద్దగా రాణింపునకు నోచుకోలేదని అంటున్నారు. పైగా చంద్రబాబుకు సరైన సమస్యలు కూడా కళ్ల ముందు లేకుండా ఊరికే ఆయుధాలను వాడుతున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రతీ దానికీ ఫీడ్ బ్యాక్ జనం నుంచి తెప్పించుకునేవారు. ఇపుడు మాత్రం చంద్రబాబు జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా ఒంటికాలు మీద లేచి జగన్ పై విమర్శలు చేయడం బూమరాంగ్ అవుతోంది. అదే సమయంలో చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడంతో అక్కడ కూడా పట్టు కోల్పోతున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు ముందు పార్టీని గాడిలో పెట్టుకుని కొన్నాళ్ళ పాటు వేచి చూసిన తరువాతనే జగన్ మీద బాణాలు వేస్తే ఫలితం ఉంటుందేమో.

No comments:

Post a Comment