Breaking News

18/10/2019

దూకుడుగా ఆదిత్య ధాక్రే...

ముంబై, అక్టోబరు 18, (way2newstv.in)
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మున్ముందు బీజేపీకి సమస్యగా మారనున్నారా? గెలిచినా, ఓడినా ఆదిత్య ఠాక్రే కమలం పార్టీని ఇబ్బంది పెట్టనున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. శివసేన అధినేత బాల్ థాక్రే కుటుంబం నుంచి ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి ఎవరూ రాలేదు. శివసేనను ముందుండి నడిపించడం తప్పించి ఆ కుటుంబం ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే మూడోతరం వారసుడు ఆదిత్య ఠాక్రే మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ సంప్రదాయాలకు స్వస్తి చెప్పేశారు.ఆదిత్యఠాక్రేకు తొలి నుంచి రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష ఉంది. తాత, తండ్రిలా కాకుండా తానే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని దాదాపు రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. 
దూకుడుగా ఆదిత్య ధాక్రే...

అందుకే మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే పాదయాత్రను కూడా చేశారు. దీంతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలను కూడా ఆదిత్య ఠాక్రే తీసుకున్నారు. పాదయాత్ర ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో పాటు, ఆదిత్య ఠాక్రే ప్రసంగాలను సయితం ప్రశాంత్ కిషోర్ టీం రూపొందించిందంటారు. పాదయాత్ర కూడా సక్సెస్ కావడంతో ఆదిత్య ఠాక్రే నేరుగా ఎన్నికల్లో్ పోటీకి దిగారు.మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కలిస్తేనే విజయం సాధ్యం అవుతుందని అనేక ఎన్నికల ఫలితాలు తెలియజెప్పాయి. అందుకే పైకి ఎన్ని విమర్శలు చేసుకున్నా శివసేన బీజేపీని వీడి పోలేదు. అలా ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్న అనుభవాలున్నాయి. అందుకే ఉద్దవ్ ఠాక్రే ఈసారి లోక్ సభ ఎన్నికల సందర్భంలోనే జరిగిన చర్చల్లో అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు కూడా చేసుకున్నారు. సీట్ల పంపకాల్లో ఏమాత్రం తేడా రాలేదు. రెండు పార్టీలూ సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఎటొచ్చీ ఆదిత్య ఠాక్రే మాత్రం బీజేపీని ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నికల ప్రచారంలో వ్యవహరిస్తున్నారు.ఈసారి బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వస్తే శివసేన అభ్యర్థి సీఎం అవుతారని ఆదిత్య ఠాక్రే పదే పదే చెబుతున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నే కొనసాగిస్తామని చెప్పింది. మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ కూటమికి సానుకూల వాతావరణం ఉండటంతో ఆదిత్య ఠాక్రే పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. అయితే దీనిపై ఫడ్నవిస్ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో కూటమిలో ఎలాంటి వివాదం లేదని ముక్తాయింపు నిచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాతే మహారాష్ట్ర సీఎం అనేది ఎవరో తేలుతుందన్నది బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది.మరి చూడాలి ఆదిత్య ఠాక్రే దూకుడుకు బీజేపీ ఎలా కళ్లెం వేస్తుందో

No comments:

Post a Comment