Breaking News

30/09/2019

శ్రీనివాసావతారానికి శ్రీకారకుడు భృగువే !

(శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం)
పురాణాలంటే ప్రాచీనమైనవని అర్థం. ప్రాచీనమైనా అవి నవ్యతకలిగినవి. వీటిల్లో అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞానవిషయాలు ఇమిడి ఉన్నాయి. దేవతల విషయాలు, భగవంతుని అవతారాలు, విశేషాలు, ఖగోళవిషయాలు, రుషులచరిత్రలు మొదలైనవి ఎన్నో. అవతారమంటే దిగడం. దివినుండి భువికి రావడం అని అర్థం. వైకుంఠం వీడి శ్రీమహావిష్ణువు భువికి దిగి వచ్చాడు. అనంతరం తిరుమలగిరులపై అర్చామూర్తిగా వెలిశాడు. మానవులకు కొంగుబంగారమై, కోరికలుతీరుస్తూ, ఆపదల నుండి రక్షిస్తూ, పిలిస్తే పలికే దేవునిగా వెలశాడు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీశ్రీనివాసునిగా పిలువబడుతూన్న దివ్యమైన అవతారానికి పూర్వ ఘట్టాన్ని తెలుసుకుందాం.తపోభూమి, జ్ఞానభూమి, పవిత్రభూమి ఐన భారతఖండంలో ఎందరో రుషులు జన్మించారు. వారిలో  భృగుమహర్షి ఒకరు. ఇతను బ్రహ్మహృదయంనుండి జన్మించాడు. 
శ్రీనివాసావతారానికి శ్రీకారకుడు భృగువే !

నవబ్రహ్మల్లో ఒకడుగా ప్రసిద్ధిగాంచాడు. మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, భృగువు, వసిష్టుడు మొదలైన వారు నవబ్రహ్మలుగా పిలువబడుతున్నారు. నవబ్రహ్మలకు కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. భృగువు కర్దమ, ప్రజాపతి కుమార్తెల్లో ఒకరైన ఖ్యాతిని వివాహం చేసుకున్నాడు.భృగుమహర్షి గొప్ప జ్ఞానసంపన్నుడు. ఇతనికి తన అరికాల్లో దివ్యచక్షువు ఒకటుంది. ఇతను ధర్మశాస్త్ర ప్రవర్తకుడిగా పేర్కొనబడ్డాడు. తన తపోబలంచేత ఎందరినో ఉద్ధరించిన మహనీయుడు. ఇతని ఆదేశానుసారం పరశురాముడు శివుని మెప్పించి భార్గవాస్త్రం పొందాడు. అలాగే భరద్వాజమహర్షి సృష్టిక్రమం మొదలైన అనేకవిషయాలు, ధర్మకార్యాచరణాంశాలు వివరంగా అడిగి తెలుసుకున్నాడట. భృగువు జ్యోతిష శాస్త్రసంబంధమైన అనేక విషయాలపై పరిశోధనలు చేశాడు. గ్రహాల ఉచ్చ, నీచస్థానాల గురించి వివరించాడు. జ్యోతిష శాస్త్రసారము రచించాడు. ఇతనిపేర స్మృతి కూడా ఒకటుంది. ఈతను భృగువంశ మూలపురుషుడు. ఈ మహనీయుడు సర్వశ్రేయస్సు కోసం ముందు నిలిచి పనులు నెరవేర్చేవాడు. ఇతని గొప్ప సేవానిరతి ఎనలేని ఖ్యాతిని తెచ్చింది.సంప్రదాయం ప్రకారం వైఖానసమహాముని తల కల్పసూత్రవిధానాన్ని తన నలుగురుశిష్యులైన భృగు, అత్రి, మరీచి, కాశ్యపులకు బోధించారు. తర్వాతికాలంలో భృగువు 'అధికార' విధానం, మరీచి 'సంహిత', కశ్యపులు 'కాండ', అత్రి 'తంత్ర' విధానాలుగా గురువులు చెప్పిన ''కల్ప సూత్రం''ను విస్తారం చేసినట్లు చెప్తారు. ఈ విధంగా భ గుమహర్షి సేవలు ఎన్నో. లోక కల్యాణార్థం భృగుమహర్షి చేసిన వృత్తాంతంలో శ్రీమహావిష్ణువు ఈ భువికి రావడానికి, శ్రీనివాసునిగా అవతరించడానికి కారణభూతుడయ్యాడు.ఒకసారి నైమిశారణ్యంలో మునులు యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో నిరంతరం హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలు సంచరించే నారదమహర్షి అక్కడికి చేరుకుని ధర్మ సందేహాన్ని లేవదీశాడు. అందులో ఏదో ఒక పరమార్థం ఉండనే ఉంటుంది కదా.ఓ మహర్షు లారా! మీరు చేస్తున్న ఈ యజ్ఞఫలం దేవాదిదేవుళ్లలో ఎవరికి దక్కుతుంది? అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మునులంతా తమలోతాము చర్చించుకుని ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సిందిగా భృగుమహర్షిని కోరారు. అంతట భృగువు లోక కల్యాణార్థమై దేవాదిదేవతల్లో ఎవరి ఉత్తములో? ఈ యజ్ఞఫలం ఎవరికి దక్కించాలో? తెలుసుకు వస్తానని ముల్లోకాలకు బయలుదేరాడు. మొదట బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ  బ్రహ్మ సరస్వతీదేవితో సృష్టివిషయాలు చర్చిస్తున్నాడు. భృగుమహర్షి వచ్చిన విషయాన్ని గమనించలేదు. అది సహించలేక భృగువు బ్రహ్మను శపించాడు. తర్వాత కైలాసానికెళ్లాడు. అక్కడకూడా ఆదిదంపతులైన శివపార్వతులు నృత్యంచేస్తూ భృగువు రాకను గమనించలేదు. భృగువు వారినీ శపించాడు. తిన్నగా వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ కూడా శ్రీమహావిష్ణువు శేషపాన్పుపై పవళించి శ్రీమహాలక్ష్మితో మాట్లాడుతూన్నాడు. భృగువు రాకను శ్రీమహావిష్ణువు కూడా చూసీ చూడ నట్టున్నాడు. ఎవరు ఉత్తమమైన వారో తెలుసుకుందామని వస్తే, ఇక్కడ త్రిమూర్తుల ఈ ప్రవర్తనేమిటని బాధపడ్డాడు.అంతేకాక, ఈ అవమానానికి తట్టుకోలేక కోపంతో శ్రీ మహావిష్ణువు వక్షఃస్థలంపై తన్నాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే తేరుకుని, ఆ మహామునికి నమస్కారం చేసి, పాదాలు కడిగి ఉపశమింప చేశాడు. ఆ తరువాత ఆతని పాదాలకింద ఉన్న నేత్రాన్ని చిదిమేశాడు. దాంతో భృగునిలో ఉన్న మాయా అహంకారం తొలగి శ్రీమహావిష్ణువుని అనేకవిధాలుగా కొనియాడాడు. తాను వచ్చినపని ఫలించిందని శ్రీమహావిష్ణువే శ్రేష్టుడనీ, పంకజాక్షుడే పరదైవమనీ, యజ్ఞ ఫలం ఇతనికే దక్కుతుందనీ మునులందరికీ చెప్పాడు. వారి సందేహాలను తీర్చాడు. మునులందరూ సంతోషించి యజ్ఞఫలాన్ని పరమపురుషుడైన శ్రీమన్నారాయణునికే సమర్పించారు.శ్రీమన్నారాయణుడు భువికిరాక, శ్రీనివాసునిగా అవతరించుట :ఈ ఘటన జరిగిన తరువాత వైకుంఠంలో శ్రీమహాలక్ష్మికి కోపం వచ్చింది. నేను నివసించే వక్షఃస్థలంపై తన్నిన మునికాళ్ళు కడిగి గౌరవించడం తగింది కాదని అలిగింది. ఇక్కడ నేను ఉండలేనంటూ భూలోకానికి వచ్చేసింది. శ్రీమహాలక్ష్మిని వెదుకుతూ శ్రీమహావిష్ణువు కూడా వచ్చేశాడు. అలా శ్రీనివాసునిగా అవతరించాడు. శ్రీమన్నారాయణుడు భూమిపై ఎన్నో అవతారాలెత్తి ఈ భూమిని కాపాడాడు. ఎప్పుడు ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడు వస్తూనే ఉంటాడు. దశావతారాలు మనందరికి తెలిసిందే. పలురూపాల్లో అవతరించే స్వామి వృత్తాంతం ఎంతో ఆసక్తికరమైంది. భృగుమహర్షి కారణభూతునిగా జరిగిన దైవలీల అది.

No comments:

Post a Comment