Breaking News

11/09/2019

కోచింగ్ సెంటర్లను తలపిస్తున్న డిగ్రీ కాలేజీలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 11, (way2newstv.in)
డిగ్రీ కాలేజీలను నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కొన్ని డిగ్రీ కాలేజీలు కోచింగ్ సెంటర్ల రూపంలో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సివిల్‍, గ్రూప్స్ కోచింగ్‍ ఇచ్చే సెంటర్లగా అవతారమెత్తాయి. విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు గతంలో తనిఖీలు చేసిన ఓయూ ఆడిట్‍ సెల్ అధికారులు నివేదికను ఎగ్జిక్యూటివ్‍ కౌన్సెల్‍ మీటింగ్‍లో పెట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగానే తనిఖీ నివేదికలను బహిర్గతం చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రేటర్‍ పరిధిలో సుమారు 60 అనుబంధ డిగ్రీ కాలేజీలున్నట్లు ఓయూ అధికారులు పేర్కొన్నారు. 
కోచింగ్ సెంటర్లను తలపిస్తున్న డిగ్రీ కాలేజీలు

ఈ కాలేజీల్లో సివిల్స్, గ్రూప్స్ తో పాటు సీఏ, సీపీటీ తదితర కోర్సులకు కోచింగ్‍ నిర్వహిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలినట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్  కోర్సులకు రూ.7 నుంచి రూ.11 వేల వరకు వసూలు చేయాలని అనుబంధ కాలేజీలకు ఓయూ నిర్దేశించింది. కొన్ని ప్రైవేట్‍ కాలేజీలకు మాత్రం విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతుల ఆధారంగా మరో రూ.3 వేల వరకు అదనంగా వసూలు చేసుకునేలా హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ ప్రైవేట్‍డిగ్రీ కాలేజీలకు వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రూ.5 వేల లోపే ఫీజులున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్ మెంట్‍ వస్తుందున ప్రైవేట్‍ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు.ఆర్ట్స్, బీకాం కోర్సుల్లో చేరే విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కార్పొరేట్‍ మేనేజ్‍మెంట్స్ భారీగా ఫీజులు వసూలు చేస్తోంది. బీఏ కోర్సులో చేరిన విద్యార్థులు సహజంగానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఆ ఆలోచనతో ఉన్న విద్యార్థుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కార్పొరేట్‍ విద్యా సంస్థలు డిగ్రీ కాలేజీల్లో సివిల్స్, గ్రూప్స్ లాంటి కాంపిటీటివ్‍ సిలబస్‍ను బోధిస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్‍ ఇచ్చేందుకు రూ.2 లక్షలను ఫీజు వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో అశోక్‍ నగర్‍లో కేవలం సివిల్స్ కోచింగ్‍ తీసుకునేందుకు సుమారుగా రూ.50 వేల వరకూ తీసుకుంటున్నారు. డిగ్రీ+సివిల్‍ కోచింగ్ పేరుచెప్పి విద్యార్థుల నుంచి మూడు రెట్లు అధికంగా దోచుకుంటున్నారు.డిగ్రీలో ఒక్కో కోర్సు ఒక్కొక్క సెక్షన్‍లో 60 మంది విద్యార్థులను తీసుకునేందుకు ఓయూ నిబంధనలు వీలుకల్పిస్తాయి. అంతకంటే ఎక్కువైతే అదనపు సెక్షన్‍కు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో కోర్సులో తెలుగు, ఇంగ్లిష్‍ మీడియాలకు కలిపి 120 మందికి అడ్మిషన్లు ఇవ్వొచ్చు. చింతలకుంట షైన్‍ ఇండియా డిగ్రీ కాలేజీలో అధికారికంగా బీఏలో రెండు కోర్సుల్లో 240 మందికి మాత్రమే అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతి ఉంది. కానీ ఇక్కడ అధికారులు తనిఖీ చేసినప్పుడు 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తేలింది. పసుమాముల వద్దనున్న నారాయణ డిగ్రీ కాలేజీలో బీఏలో మూడు సెక్షన్లకు అనుమతి ఉంది. ఇందులో అధికారికంగా 180 మంది విద్యార్థులు మాత్రమే ఉండాల్సి ఉండగా 350 మంది తరగతులకు హాజరవుతున్నట్లు అధికారులు చెప్పారు.కొహెడలోని నారాయణ డిగ్రీ కాలేజీ కూడా బీఏలో 3 సెక్షన్లు ఉన్న విద్యార్థులు సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంది. కుంట్లూర్‍లోని నారాయణ డిగ్రీ కాలేజీలో బీఏలో 4 సెక్షన్లకు అనుమతి ఉంది. దీని ప్రకారం అక్కడ 240 మంది మాత్రమే విద్యార్థులు చదువుకోవాల్సి ఉండగా అంతకు మూడు రెట్లు విద్యార్థులు ఉన్నట్టు ఓయూ ఆడిట్‍ సెల్‍ అధికారులు తెలిపారు. కోచింగ్‍ పేరుతో అదనంగా విద్యార్థులను చేర్చుకొని అడ్మిషన్లను ఇతర అనుబంధ కాలేజీల్లో చూపుతూ కార్పొరేట్‍ కాలేజీలు తమదైన దారిలో ఓయూ ఆడిట్‍ అధికారులను మేనేజ్‍ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.డిగ్రీ కాలేజీలు నిర్వహిస్తామని అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యార్థులను కార్పొరేట్ విద్యా సంస్థలు మోసం చేస్తున్నాయి. డిగ్రీ+కోచింగ్, ఇంటర్+డిగ్రీ+సివిల్స్ ఇలా కాంబినేషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతంలో చేసిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన ఓయూ ఆడిట్ అధికారులు సమస్యలను ఈసీలో పెడతామని చెప్పి ఆపై పట్టించుకోవడం లేదు

No comments:

Post a Comment