Breaking News

24/09/2019

జగన్ రివర్స్ నుంచి పాజిటివ్ వేవ్

విజయవాడ, సెప్టెంబర్ 24, (way2newstv.in)
వైఎస్ జగన్ సర్కార్ నాలుగవ నెలలోకి అడుగుపెడుతోంది. తలపండిన సీనియర్ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మంత్రిగా కూడా పనిచేయని వైఎస్ జగన్ సీఎంగా వైసీపీ సర్కార్ బుడి బుడి అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. వంద రోజుల సర్కార్ విషయంలో పెదవి విరిచిన టీడీపీ కూడా ఇపుడు తిరిగి ఆలోచనలో పడేలా సర్కార్ బాలారిష్టాలను ఒక్కక్కటీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ జగన్ తొలి అడుగుల్లో ఉన్న ఆవేశం, ఆరాటం వల్ల కొన్ని పొరపాట్లు, తడబాట్లు కనిపించినా ఇపుడు మాత్రం దశ దిశ సవ్యంగానే చూసుకుని ప్రభుత్వం పయనం చేస్తుందనుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ప్రభుత్వం చెప్పిన మాటలు ఇపుడు క్షేత్ర స్థాయిలోకి చేరుతున్నాయి.
జగన్ రివర్స్ నుంచి పాజిటివ్ వేవ్

కార్యాచరణ కూడా మొదలైంది. దాని వల్ల సర్కార్ మీద ఒకింత సానుకూల భావన కూడా ఇపుడిపుడే ఏర్పడే అవకాశలు మెరుగు అవుతున్నాయి.నిజానికి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా చెప్పిన మాట విన్న వారికి పెద్దగా నమ్మకం కుదరలేదు. పేద రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లక్షల్లో కల్పించడం సాధ్యమేనా అని అనుకున్న వారు ఉన్నారు. కానీ వైఎస్ జగన్ ప్రమాణం చేస్తూనే చెప్పిన విధంగా గ్రామ వాలంటీర్లతో పాటు, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలను తీసి రికార్డు సృష్టించారు. వాటి అమలు కూడా ఇపుడు పూర్తి కావడంతో ఓ వర్గంలో వైఎస్ జగన్ మీద నమ్మకం ఏర్పడిందన్నది వాస్తవం. ఇది గత సర్కార్ కి భిన్నమైన వైఖరిగానే చెప్పుకోవాలి. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అందని పండుగా ఉండేది. దాన్ని మార్చి వైఎస్ జగన్ అతి తక్కువ సమయంలో చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ప్రతిపక్షంగా టీడీపీ బయటకు వంకలు పెట్టినా వారిలోనూ వైసీపీ చేసిన ఈ మంచి పనిని లోలోపల అభినందించిన వారే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.ఇక రివర్స్ టెండరింగ్ అని వైఎస్ జగన్ చెప్పినపుడు మహామహులకే అది అర్ధం కాని విషయంగా ఉంది. రివర్స్ సర్కార్ అంటూ టీడీపీ నాయకులు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. అయితే వైఎస్ జగన్ పోలవరం టెండర్ల విషయంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి ప్రభుత్వానికి ఆదాయం మిగల్చడం చూసిన వారు ఇపుడు భేష్ అంటున్నారు. ప్రజాధనం వృధా కాకుండా ఆపినందుకు ప్రభుత్వానికి మంచి పేరే వచ్చింది. ఇది రివర్స్ గేర్ కాదు. పాజిటివ్ వేవ్ అని కూడా అంటున్నారు. ఇదే తీరున వైఎస్ జగన్ నీటి ప్రాజెక్టుల విషయంలోనూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మరో వైపు సంక్షేమ క్యాలండర్ పక్కాగా అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ తో సిధ్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూసినపుడు వైఎస్ జగన్ సర్కార్ మీద వస్తున్న ఆరోపణలు నెమ్మదిగా తేలిపోతున్న భావన వ్యక్తం అవుతోంది. కొత్త సర్కార్ ఆలోచనల ఫలితాలు జనాలకు పూర్తిగా చేరువ అయిన రోజున అధికార పార్టీకి మరింత మద్దతు దొరికే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిలకడగా వైసీపీ సర్కార్ వేస్తున్న అడుగులు చూస్తే తొలి గండాలను దాటినట్లుగానే అర్ధం చేసుకోవాలి.

No comments:

Post a Comment