Breaking News

17/08/2019

ప్రజాక్షేత్రంలోకి దేవగౌడ

బెంగళూర్, ఆగస్టు 17  (way2newstv.in)
జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ జనం బాట పడుతున్నారు. ఈ వయసులోనూ ఆయన పార్టీని పటిష్టం చేయడం కోసం నడుంబిగించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు దేవెగౌడను కలచి వేశాయి. ఒకరి మీద ఆధారపడితే ఎప్పుడైనా ఇంతే జరుగుతుందని గతంలో పలుమార్లు రుజువైనా ప్రజల్లోకి వెళ్లకపోవడం వల్లనే జేడీఎస్ మెరుగైన ఫలితాలు సాధించలేక పోతోందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.ఇటీవల కుమారస్వామి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో భారతీయ జనతా పార్టీ కూల్చివేయడంతో దేవెగౌడ బీజేపీ కంటే కాంగ్రెస్ పైనే కోపంగా ఉన్నట్లు కనపడుతుంది. అందుకే ఆయన ఒంటరిపోరుకే దాదాపు సిద్దమయిపోయారు. జిల్లాల పర్యటనలతో పార్టీని పటిష్టం చేసే యోచనలో ఉన్నారు. 
ప్రజాక్షేత్రంలోకి దేవగౌడ

దేవెగౌడ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం దృష్ట్యా పర్యటనలు వద్దని సూచిస్తున్నారు. అయినా దేవెగౌడ మాత్రం తానే వెళతానిని మొండికేశారు.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ క్యాడర్ లో ఆత్మస్థయిర్యం నింపాల్సిన సమయం ఇది. పధ్నాలుగు నెలలు పార్టీనేత ముఖ్యమంత్రిగా వ్యవహరించినా నేతలకు, క్యాడర్ కు ఏం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కుటుంబ పార్టీ అన్న ముద్ర ఎటూ ఉండనే ఉంది. దీని నుంచి బయటపడటానికి పార్టీ అధ్యక్షుడిని వేరే వారిని నియమించినా జనం నమ్మడం లేదు. దీంతో పెద్దాయన దేవెగౌడ తానే రంగంలోకి దిగి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయడానికి రెడీ అయిపోయారు.తనతో పాటు మనవడు నిఖిల్ గౌడ ఓటమికి కాంగ్రెస్ కారణం కావడంతో కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతాల్లోనూ పాగా వేయాలన్నది దేవెగౌడ వ్యూహంగా కన్పిస్తుంది. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదు. జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే పెద్దాయన ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతోనే. ఆ మాట నేరుగా కార్యకర్తలతోనే దేవెగౌడ చెబుతున్నారు. మొత్తం మీద దేవగౌడ కుమారస్వామి, రేవణ్ణలను పక్కనపెట్టి తాను స్వయంగా రంగంలోకి దిగడం పార్టీలో చర్చనీయాంశమైంది.

No comments:

Post a Comment