Breaking News

06/08/2019

ఆర్మూర్ లో అడ్డూ, అదుపు లేని పేలుళ్లు...

కనిపించని రక్షణ చర్యలు 
నిజామాబాద్, ఆగస్టు 6, (way2newstv.in)
ప్రస్తుతం నిజామాబాద్‌, కామారెడ్డిలలో 97 క్వారీలున్నాయి. అందులో నిత్యం పేలుళ్లతో కొండలను పిండి చేస్తున్నారు. ఈ సమయంలో కనీస రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. దీంతో అక్కడ పనిచేసే వారు కాదు.. రైతులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు తరుచూ గాయాల పాలవుతున్నారు. చుట్టు   పక్కల ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. అయినా క్వారీల నిర్వాహకులపై నియంత్రణ ఉండట్లేదు.నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి, ధర్పల్లి, మాక్లూర్‌, నందిపేట్‌, కమ్మర్‌పల్లి, ఇందల్‌వాయి, నవీపేట్‌ మండలాల్లో  కామారెడ్డిలోని బాన్సువాడ, కోటగిరి, ఎల్లారెడ్డి, కామారెడ్డి పరిధిల్లో ఎక్కువగా ఉన్నాయి. కొండలు ఉన్న ప్రాంతాలను లీజుకు తీసుకోవటంతో పాటు అసైన్డు భూముల్లో అనుమతులు తెచ్చుకొని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా గడిచిన ఐదేళ్లలో ఈ క్వారీల సంఖ్య 97 వరకు చేరింది.ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా కంకర, రోడ్డు మెటల్‌ క్వారీలున్నాయి. 
ఆర్మూర్ లో అడ్డూ, అదుపు లేని పేలుళ్లు...

వీటి ద్వారా నిత్యం రూ.కోటి వరకు వ్యాపారం జరుగుతుంటుంది.వాస్తవానికి కొండలపై ఉన్న బండరాళ్లను తీయాలన్నా పర్యావరణ అనుమతులు తప్పనిసరి. బండరాళ్లను చిన్నపాటి ముక్కలు చేసేందుకు కూడా నిబంధనలున్నాయి. క్వారీల నిర్వాహకులు వీటిని లెక్క చేయట్లేదు. బండలను పేల్చేందుకు అత్యంత ప్రమాదకరమైన పవర్‌జెల్‌, ఈడీలు, జిలెటిన్‌ స్టిక్స్‌, బూస్టర్లను వాడుతున్నారు. భారీ పేలుడు జరగడంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, పక్షులు, చెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువ లోతువరకు బండరాయిని తవ్వటం వల్ల చుట్టుపక్కల బోర్లు ఎత్తిపోతున్నాయి. దీని ప్రభావం పంటల మీద కూడా చూపుతోంది. పంట పొలాలకు వెళ్లే రైతులు పేలుడు శబ్దాలతో వణికిపోతున్నారు. బండరాళ్లు పడి గాయాల పాలవుతున్న సంఘటనలు కోకొల్లలు. జనరద్దీ ఉన్న ప్రాంతాలకు కనీసం కిలో మీటరు దూరంలో బ్లాస్టింగ్‌ జరపాలి. ఎక్కడికక్కడ బండరాళ్లను పేల్చేస్తున్నారు.పేలుళ్లు జరిపే సమయంలో లైసెన్సు కలిగిన బ్లాస్టరు ఉండటం తప్పనిసరి. బ్లాస్టరు అన్నీ పక్కాగా చూసుకొని చుట్టు పక్కల పరిధిల్లో కాపలాగా వ్యక్తులను ఉంచాలి. ఆ తర్వాత సైరన్‌ మోగించి బ్లాస్టింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో లైసెన్సులు లేని బ్లాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. వీరికి ఏమాత్రం అవగాహన లేకున్నా ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. పేలుడు జరపక ముందు, జరిపిన తర్వాత పేలుడు పదార్థాల లెక్కలపై నిత్యం స్థానిక ఠాణాకు సమాచారం ఇవ్వాలి. క్వారీ వద్ద వీటిని నిల్వ చేసేందుకు పూర్తిగా మూసి ఉండే గది తప్పనిసరి. క్వారీలో ఉండే వారితో పాటు బ్లాస్టింగ్‌ ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి పూరి అనుభవం ఉండితీరాలి. వీరికి రక్షణగా హెల్మెట్‌, మాస్క్‌లతో పాటు ప్రత్యేక చొక్కా ఉండాలి.పేలుడు సామగ్రి తరలించే సమయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి. నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా ఈ పేలుడు సామగ్రిని సరఫరా చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి పక్కా నిబంధనలు పాటించట్లేదు. నిల్వ చేయటం నుంచి క్వారీకి తరలించే వరకు స్థానిక ఠాణాలకు సమాచారం ఇవ్వాలి. ఇది కూడా పక్కాగా అమలు కాని పరిస్థితి.

No comments:

Post a Comment