Breaking News

12/08/2019

అక్టోబరు 31 నుంచి యూటీగా జమ్మూ కశ్మీర్

శ్రీనగర్, ఆగస్టు 12, (way2newstv.in)
ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కశ్మీర్ విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించగా.. రాష్ట్రపతి కోవింద్  ఆమోదముద్ర వేశారు. అక్టోబర్ 31 నుంచి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కానుంది. జమ్మూ కశ్మీర్ విభజన చట్టం 2019 ప్రకారం ఆ రాష్ట్ర పోలీసు, శాంతి భద్రతల బాధ్యత కేంద్రం తీసుకోనుంది. రాష్ట్ర అసెంబ్లీ జాబితాలో భూభూగం రానుంది. భూముల క్రయవిక్రయాలు, భూమిని లీజ్‌కి ఇవ్వడం, బదిలీ చేయడం, వ్యవసాయ రుణాలు తదితరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడక్ ఇప్పుడున్న హైకోర్టును ఉమ్మడిగా ఉపయోగించుకుంటాయి. 
అక్టోబరు 31 నుంచి యూటీగా జమ్మూ కశ్మీర్
ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఏసీబీ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో పని చేస్తారు. ఇప్పటికే పని చేస్తున్న వారికి అదే కేడర్ ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం అధికారులకు కేంద్రపాలిత ప్రాంతం కేడర్‌గా పోస్టింగ్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ అనేక విషయాల్లో ఢిల్లీని పోలి ఉండనుందని సమాచారం. దేశరాజధానిలో పోలీసులు, శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఢిల్లీలో భూమి కూడా కేంద్రం పరిధిలోకి వస్తుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా భూముల బాధ్యతను లెఫ్టినెంట్ ‌గవర్నర్ పర్యవేక్షిస్తున్నారు. కానీ జమ్మూకశ్మీర్లో మాత్రం భూములు రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. భూముల ద్వారా వచ్చే ఆదాయం, భూముల రికార్డుల నిర్వహణ తదితరాలన్నీ ఎన్నిక కాబోయే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ పరిధిలోకి వస్తాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ బలం 107గా ఉండనుంది. డీలిమెటేషన్ తర్వాత అది 114కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 24 సీట్లను ఖాళీగా ఉంచుతున్నారు. విభజన చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్ మొత్తానికి లేదా ఏదైనా ప్రాంతం కోసం చట్టాలు చేసే వెసులుబాటు అసెంబ్లీకి ఉండనుంది. 

No comments:

Post a Comment