Breaking News

27/07/2019

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం

కాకినాడ, జూన్ 27, (way2newstv.in)
రుసుములు, ఖర్చుల భారం..ఆపై ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ పనితీరు చూపుతుండటంతో తల్లిదండ్రులు సర్కారు బడులపై క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో కంటే 2018-19 విద్యా సంవత్సరంలో పిల్లల సంఖ్య బాగా పెరుగుతోందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా దుస్తులు, పుస్తకాలు తదితరాలు ఉచితంగా అందుతున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందిస్తూ పిల్లలు ఆరోగ్యంగా ఉండేవిధంగా అడుగులు వేస్తున్నారు. గతంలో భోజనంతోపాటు వారానికి మూడు కోడి గుడ్లు ఉడికించి అందించేవారు. ఈ ఏడాది నుంచి ఐదు గుడ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం, ఉపకారవేతనాలు అందిస్తున్నారు. 
 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం

పాఠశాలలు దూరంగా నివాసం ఉండే బాలికలకు ఇబ్బందులు కలగకుండా ఉచితంగా సైకిళ్లను అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం కూడా వాటిని అందించేందుకు రంగం సిద్ధం చేయనున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి విద్యను అందిస్తున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ కొన్ని బడులు ఆదర్శంగా నిలిచాయి. అదేవిధంగా గతం నుంచి ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధిస్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. అన్నింటికి మించి ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కగా ఆడుకునేందుకు క్రీడామైదానాలు, ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కొన్నిచోట్ల పూర్తి స్థాయిలో సదుపాయాలు లేకపోయినా ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే చాలన్న భావనతో తల్లిదండ్రులు సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రవేశాల పెరుగుదలకు కారణమవుతున్నారు. జిల్లాలో 2,542 ప్రాథమిక, 272 ప్రాథమికోన్నత, 391 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం కలుపుకొని 3,225 విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 2,26,539 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట ప్రభుత్వ పాఠశాలలంటే రేకులషెడ్లు, శిథిల భవనాలు, నామమాత్రం సదుపాయాలుండేవి. దీన్ని ఆసరాగా చేసుకునే ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు విజృంభించాయి. తల్లిదండ్రులు తమ సంపాదనలో పిల్లల విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారు. దీనికోసం ఎంతో మంది అప్పులు కూడా చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. కొద్దిపాటి సదుపాయాలున్నా వాటిని ఆకర్షించే విధంగా తల్లిదండ్రులకు చూపించి వేలకువేలు రుసుములు దండుకున్న సందర్భాలున్నాయి. పేదలు సైతం సర్కారు బడులను కాదని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాలయాల్లో 2014 నుంచి 2017 విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతైనా తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా అక్కడ మానేసి సర్కారు బడుల్లో చేరేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఫలితంగా గతేడాది నుంచి పిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఈ యేడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి ఒకటి నుంచి పదోతరగతి చదివే విద్యార్థులు ఇప్పటి వరకూ 50 వేల మందికి పైగా చేరినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు తదితర ప్రాంతాల ప్రభుత్వ విద్యాలయాల్లో చేరుతున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అందులో సుమారు 15 వేల మంది విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల నుంచి వచ్చినట్లు వివరిస్తున్నారు. వీరందరికీ మొదటి నుంచే సమయం వృథా చేయకుండా నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసే విధంగా ఉపాధ్యాయులు ముందుకు సాగితే మంచిది.

No comments:

Post a Comment