తిరుపతి, జూన్ 27, (way2newstv.in)
తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్ 12న పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని నగరంలోని రెండు ప్రాంతాల్లో నాలుగు కెమెరాలతో సీసీ కెమెరా నిఘా కేంద్రాన్ని తిరుపతి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ప్రారంభమైన ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం 2014లో పోలీసు శాఖ ఆధునికీకరణలో భాగంగా రూ.50 లక్షలు కేటాయించింది. దీంతో సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో వీడియోవాల్‌తో 2014 డిసెంబర్ 26న ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలోని 59 ప్రధాన కూడళ్లలో దాదాపు 324 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో పీటీజెడ్ వంటి అత్యాధునిక జూమింగ్ సదుపాయం కలిగిన 41 కెమెరాలు ప్రధాన ప్రాంతాల్లో అమర్చారు.
తిరుపతిలో అడుగుడుగునా నిఘా
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన అనంతరం అదనంగా 100నుంచి 150 కెమెరాలను ఏర్పాటు చేయించారు. గతంలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాలైన చెర్లోపల్లి నుంచి పద్మావతిపురం వరకు ఉన్న చాముండేశ్వరి ఆలయం, తుమ్మలగుంట, ఉప్పరపల్లి, వైకుంఠపురం, అవిలాల కూడలి, ఆంధ్రాబ్యాంక్ కాలనీ, ట్విన్ టవర్స్, కేశవాయనగుంట, పద్మావతిపురం, శ్రీనివాసపురం వరకు వీటిని కొత్తగా ఏర్పాటు చేశారు.ప్రస్తుతం అర్బన్ జిల్లా పరిధిలో ఉన్న సీసీ కెమెరా నిఘా నియంత్రణ కేంద్రం విజయవాడలోని సెంట్రల్ కమాండ్ కేంద్రానికి అనుసంధానమై ఉంది. ప్రభుత్వ రియల్‌టైమ్ గవర్నెన్స్ లింక్ కలిగి ఉంటుంది. దీంతో తిరుపతిలోని సీసీ కెమెరా నిఘా కలిగిన ప్రతి ప్రాంతాన్ని సెంట్రల్ కమాండ్ కేంద్రం ద్వారా ప్రభుత్వ అధికారులు ఎప్పుడైన పరిశీలించవచ్చు. ప్రసుత్తం నూతనంగా అర్బన్‌జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండో సీసీ కెమెరా నిఘాకేంద్రాన్ని ఆర్‌టీజీకి అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు నిరంతరం నగరంపై రాజధాని నుంచే నిఘా ఉంచే అవకాశం కలుగుతుంది. జిల్లా మొత్తం ప్రభుత్వ పర్యవేక్షణ పరిధిలోకి వెళుతుంది.పీటీజెడ్ కెమెరాలు అర్బన్ జిల్లా వ్యాప్తంగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, చంద్రగిరి, రంగంపేట, తిరుపతి నుంచి వడమాలపేట వరకు, తిరుమల తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా తిరుపతి నగరంలో ప్రవేశించే అన్ని మార్గాల్లో అమర్చుతున్నారు. నగరం బయట దాదాపు 500, నగరంలో 300 సీసీ కెమెరాల ఏర్పాటు జరుగుతోంది. నగరంలోకి ప్రవేశించే ప్రతి ఒక్క వాహనాన్ని, వ్యక్తిని గుర్తించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment