Breaking News

22/07/2019

జనసేనకు నిధుల సమస్య...

పెద్ద ఎత్తున విరాళాల సేకరణలో ఫ్యాన్స్
హైద్రాబాద్, జూలై 22, (way2newstv.in)
జనసేన తాజా ఎన్నికల్లో బోల్తా పడ్డాక జనసేనాని పవన్ కల్యాణ‌్ పత్తా లేకుండా పోయారు. ఆయన కమిటీలు వేస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని హడావుడి చేశారు. అయితే మధ్యలో అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఇపుడు పవన్ కల్యాణ‌్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న ఆవేదన పార్టీలో అభిమానులకు ఉంది. పవన్ కల్యాణ‌్ అయిదేళ్ల పాటు పార్టీని నడపాలి. తాను మళ్లీ సినిమాల జోలికి పోనని, పార్టీ కోసం పనిచేస్తానని గట్టిగా చెబుతున్నారు. అంటే ఇప్పటి నుంచి ఆయన ప్రజా క్షేత్రంలో ఉంటే వచ్చే అయిదేళ్ల నాటిని ఓ ఫోర్స్ గా మారవచ్చు అన్న నమ్మకం అయితే కార్యకర్తల్లో ఉంది. మరి పవన్ కల్యాణ‌్ కార్యక్షేత్రంలోకి ఎపుడు వస్తారో, పార్టీని మొత్తం కదిలించి పోరాటాలకు ఎలా సమాయత్తం చేస్తారో ఇవన్నీ ప్రశ్నలే. అయితే పవన్ కల్యాణ‌్ వైఖరి మీద పార్టీ వారికి విశ్వాసం ఉన్నా రాజకీయ మేధావులకు మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి.పార్టీని నడిపించాలంటే చిన్న విషయం కాదు. 
జనసేనకు నిధుల సమస్య...

అందులో ఒకసారి దారుణంగా ఓడిన పార్టీ మీద డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. నలభయ్యేళ్ళ చరిత్ర ఉన్న టీడీపీ కూడా ఎలా పార్టీని అయిదేళ్ళు నడపాలా అని సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ‌్ కి ఎన్నో సవాళ్లు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే టీడీపీతో పోలిస్తే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ ఆయనకు ఉంది. సినీ నటుడిగా గ్లామర్, రాజకీయంగా చూసే ఆయన వయసు యువకుడి కిందనే లెక్క కావడం, బలమైన సామాజిక వర్గం వెంట ఉండడం వంటివి ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. మైనస్ లను పక్కన పెట్టి ఈ ప్లస్ లను చూసుకునే ముందుకు సాగితే ఏపీలో జనసేన ఓ బలమైన శక్తిగా నిలుస్తుంది కూడా. కానీ పవన్ కల్యాణ‌్ మనసులో ఏముందో ఇంకా తెలియడంలేదు. ఆయన అయిదేళ్ల పాటు జనక్షేత్రంలోనే ఉంటారా, లేక సినిమాల్లో నటిస్తారా అన్నది కూడా తెలియడంలేదు. అదే జరిగితే దాని వల్ల కూడా లాభం ఉంది. నష్టం కూడా ఉంది.ఇదిలా ఉండగా తమ వెండితెర వేలుపు, నాయకుడు పార్టీని నడిపేందుకు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని భావించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు నడుం బిగించారు. దాదాపుగా వంద కోట్ల రూపాయలను విరాళంగా సేకరించి పవన్ కళ్యాణ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2 న ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా విరాళాల సేకరణ చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ప్రవాసంలో ఉన్న పవన్ కల్యాణ‌్ అభిమానులు తలచుకుంటే వంద కోట్ల రూపాయల మొత్తం వసూలు కావడం కష్టమేమీ కాదు. అయితే పవన్ కల్యాణ‌్ సమస్య నిధుల విషయమే అయితే జనసేనకు ఆ మొత్తం బాగా అక్కర తీరుస్తుంది.అది కాకుండా పవన్ కల్యాణ్ వైఖరిలోనే కొంత మార్పు రావాలంటే మాత్రం అభిమానులు వేచి ఉండాల్సిందేనని అంటున్నారు. ఏపీలో ఇపుడు వైసీపీ బలంగా ఉంది. ఎంత కాదనుకున్నా టీడీపీయే ప్రత్యామ్న్యాయంగా ఉంటుంది. బీజేపీ కేంద్రంలో ఉన్న బలంతో హడావుడి చేస్తోంది. వీటిని తట్టుకుని జనంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం పవన్ కల్యాణ్ కచ్చితమైన బలమైన వైఖరి తీసుకుని నిరంతరం జనంలో ఉండేలా పక్కా కార్యాచరణతో ముందుకు రావాల్సిందే. అపుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది

No comments:

Post a Comment