Breaking News

27/07/2019

ఓటు బ్యాంకు ను స్ట్రాంగ్ చేసే పనిలో జగన్

విజయవాడ, జూలై 27, (way2newstv.in)
అపుడెపుడో నాలుగు దశాబ్దాల క్రితం నాటి మాట. అన్న నందమూరి తెలుగుదేశం పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చాక చాలామంది కాంగ్రెస్ నాయకులను ఒక్కసారిగా రాజకీయ నిరుద్యోగులుగా మార్చేశారు. వారిలో సగానికి సగం మంది తరువాత ఎన్నికల్లో కనిపించకుండా పోతే మిగిలిన వారు కాలగమనంలో అస్త్ర సన్యాసం చేశారు. ఇపుడు ఏపీలోనూ అటువంటి పరిస్థితులే మళ్ళీ కనిపిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా తలపండిన కాంగ్రెస్ నాయకులకు ఇక రెస్ట్ తప్పకపోవచ్చునని కూడా గట్టిగా మాట వినిపిస్తోంది. తాజాగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దానితో పాటే మరో వార్త కూడా వినిపించారు. తాను కొన్నాళ్ళ పాటు రాజకీయల నుంచి దూరంగా జరుగుతానని ఆయన చెప్పుకొచ్చారు. నిజమే రఘువీరారెడ్డి ఈ ప్రకటన ధైర్యంగా చేశారు. 
ఓటు బ్యాంకు ను స్ట్రాంగ్ చేసే పనిలో జగన్

చాలా మంది అలా చేయకపోయినా రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు.దేశమంతా ఎమెర్జెన్సీకి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎలుగెత్తినా ఏపీలో మాత్రం ఇందిరా గాంధీ పేరు మీద పుట్టిన కాంగ్రెస్ ని బంపర్ మెజారిటీతో 1978 ఎన్నికల్లో గెలిపించారు. ఇందిరాగాంధీని కూడా ఉమ్మడి ఏపీలో మెదక్ నుంచి ఎంపీగా గెలిపించి పంపారు. తెలుగుదేశం ఏర్పాటు తరువాత కాంగ్రెస్ లో పాతతరం పక్కకు పోయినా కొత్తతరం కధ నడిపిస్తూ వచ్చింది. అటువంటి కాంగ్రెస్ కు 2014 లో విభజన పుణ్యమాని హై కమాండ్ సమాధి కట్టేసింది. ఇచ్చిన తెలంగాణాలో కాంగ్రెస్ ఉనికి పాట్లు పడుతూంటే ఏపీలో మాత్రం చావు దెబ్బ తినేసింది. అయిదేళ్ళ పాటు కాంగ్రెస్ నామమాత్రంగా ఉన్నా పోరాడిన వారు సైతం తాజా ఎన్నికల్లో తట్టా బుట్టా సర్దుకున్నారు. ఇక ఎక్కడ కుదరని వారు ఇలా సెలవులంటూ వెనక్కు తగ్గుతున్నారు. ఏపీలో ఇపుడు కాంగ్రెస్ అన్న మాట లేదు. హస్తం అన్న గుర్తు చెరిగిపోయి రాజకీయ విషాదంగా మిగిలింది..ఇక ఏపీలో వైసీపీ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని సొంతం చేసుకుంది. 2014 కంటే కూడా వైసీపీ ఇపుడు ఏపీలో పటిష్టంగా ఉంది. పైగా అధికారం చేతిలో ఉండడంతో జగన్ పార్టీని ఇంకా పునాదుల స్థాయిలో బలంగా నిర్మిస్తున్నారు. కాంగ్రెస్ కి ఎసీ, ఎస్టీ, మైనారిటీలు బలంగా ఉంటే ఆ ఓటు బ్యాంక్ ని ఒడుపుగా పట్టేసుకున్న జగన్ ఇపుడు టీడీపీ ఓటు బ్యాంక్ అయిన బీసీలను కూడా తన వైపునకు తిప్పుకుంటున్నారు. ఈ కొత్త సామాజిక వర్గ సమీకరణ విజయవంతం అయితే వైసీపీ మరికొన్ని దశాబ్దాల పాటు ఏపీలో సుస్తిరంగా రాజ్యమేలడం ఖాయం. అదే జరిగితే కాంగ్రెస్ పాతతరం నాయకులకు బతుకూ భవిష్యత్తు ఉండదు. ఈ తత్వం బోధపడిన వారు వేరే పార్టీలకు మారుతున్నారు. ఎక్కడా అవకాశం చిక్కని వారు మాత్రం రాజకీయాలకు గుడ్ బై అంటున్నారు. ఇది కాల మహిమ అని ఎంతలా అనుకున్నా కాంగ్రెస్ సమాధి కావడానికి మాత్రం ఆ పార్టీ అధినాయకత్వమే బాధ్యత వహించాలని గట్టిగా చెప్పకతప్పదు.

No comments:

Post a Comment