Breaking News

10/07/2019

వేతన వెతలు (ఆదిలాబాద్)

ఆదిలాబాద్‌, జూలై 10 (way2newstv.in) : 
జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 10 నాటికి కేవలం 112 మంది కార్యదర్శులు మాత్రమే ఉండగా ఏప్రిల్‌ 11న కొత్తగా 294 మంది జూనియర్‌ కార్యదర్శులు విధుల్లో చేరారు. అంతకు ముందు ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు ఉండగా ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల రాకతో 55 గ్రామాలకు మినహా జిల్లాలోని అన్ని పంచాయతీలకు కార్యదర్శులున్నారు. అయితే గ్రామ పరిపాలనను గాడిన పెట్టిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి రెండు నెలలు దాటినా వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.   
వేతన వెతలు (ఆదిలాబాద్)

ఉద్యోగం వచ్చిందని సంతోషంలో ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు రెండునెలలు దాటినా వేతనాలు అందడం లేదు. ఏప్రిల్‌ 11న నియామక ఉత్తర్వులు అందుకుని మరుసటి రోజునే విధుల్లో చేరిన వారు కొత్త ఉత్సాహంతో పనిచేశారు. గ్రామాల్లోనే నివాసం ఉంటూ విధుల్లో నిమగ్నమయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచి పార్లమెంట్‌ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తాజాగా తెలంగాణకు హరితహారం, ఇంకుడు గుంతల తవ్వకాలు, వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ వారికి వేతనాలు రాకపోవడంతో ఇంటిఅద్దె, కుటుంబ పోషణ ఖర్చులతో పాటు ఈ నెలలో పిల్లలకు పాఠశాలల ఖర్చులు మరింత పెరిగి ఆవేదనకు గురవుతున్నారు. ఎలాగూ వేతనాలు వస్తాయనే ఆశతో అప్పులు చేయక తప్పడం లేదని వారు వాపోతున్నారు.  వేతనాల చెల్లింపునకు ముందు ఉద్యోగులకు ఎం ప్లాయిమెంట్‌ ఐడీ తయారు చేసుకోవాల్సి ఉం టుంది. ఈ వివరాలను జిల్లా పంచాయతీ కార్యాలయానికి, ట్రెజరీకి పంపితేనే వేతనాల చెల్లింపునకు వీలుంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ మండలంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వేతనాల చెల్లింపు మరింత ఆలస్యమవుతుందని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వివరాలు పంపించాలని ఉన్నతాధికారుల నుంచి తమకెలాంటి ఆదేశాలు అందలేదని ఎంపీడీవోలు చెబుతున్నారు.   

No comments:

Post a Comment