Breaking News

03/07/2019

విశాఖపై వైసీపీ గురి..


విశాఖపట్టణం, జూలై 3, (way2newstv.in)
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. విశాఖ నగరంలో ఉన్న ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి మాత్రం టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ. సత్యనారాయణ మాత్రం స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నగరంలోనే ఉన్న పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో వైసిపి ఘన విజయం సాధించింది.ఇంత వరకు బాగానే ఉన్నా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి విశాఖ నగరం, జిల్లా నేత‌ల‌ మధ్య ఆధిపత్య యుద్ధం ప్రారంభమైనట్టు ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బ‌హిరంగ వేదిక‌ల మీదే  వైసీపీ న‌గ‌ర‌, జిల్లా పార్టీ నాయ‌కులు కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్లు ఇచ్చుకునే ప‌రిస్థితి. ముఖ్యంగా రూరల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు నగర రాజకీయాల్లో జోక్యం చేసుకునేలా వ్యవహరించటం నగర పార్టీ నేతలకు నచ్చటం లేదు.అవంతికి శ్రీనివాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడు స‌న్మాన స‌భ‌ సందర్భంగా జిల్లాలోని చోడ‌వ‌రం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ న‌గ‌రంలో పార్టీ ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించడంతో పాటు  వైసీపీ విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకే జగన్ అవంతి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చారని… గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని గెలిపించ‌డంలో ఆయ‌న‌దే ప్రధాన పాత్ర అన్నారు. 

 విశాఖపై వైసీపీ గురి..

ఈ వ్యాఖ్యల‌పై కౌంట‌ర్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ అవంతి జిల్లాకు మాత్రమే మంత్రి కాదని రాష్ట్రానికి మొత్తం మంత్రి అని…. కొన్ని కారణాలతో నగరంలో వైసిపి ఓడిపోయి ఉండవచ్చని.. త‌మ‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌డం క‌రెక్ట్ కాద‌ని ధర్మశ్రీకి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఆ సమావేశంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.ఇక తాజాగా జరిగిన వైసీపీ నగర పార్టీ సమావేశంలో య‌ల‌మంచి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే పార్టీ అధినేత జగన్‌పై ఒక టిడిపి ఎమ్మెల్యే నడిరోడ్డు మీద పార్టీ అధినేత‌ను తీవ్రంగా తిడితే (తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు) కౌంట‌ర్ ఇచ్చే స‌త్తా కూడా నగర వైసిపి నాయకులకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దీంతో మ‌రోసారి రూరల్ జిల్లా ఎమ్మెల్యేలకు నగర నాయకులకు మధ్య ఉన్న గ్యాప్‌ స్పష్టంగా బయట పడినట్లు అయింది. రూర‌ల్ ఎమ్మెల్యేలు న‌గ‌రంలో గ్రిప్ కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్న ప్రచారం కూడా అక్కడ జ‌రుగుతోంది. దీనికి ప్రధాన కార‌ణం న‌గ‌రంలో నాలుగు చోట్ల ఒక్క ఎమ్మెల్యే కూడా గెల‌వ‌క‌పోవ‌డ‌మే.క‌న్నబాబు రాజు వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే రియాక్ట్ అయిన ద్రోణంరాజు శ్రీనివాస్ కార్యకర్తలను, నేతలను రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడవద్దని… నగరంలో చేతకాని వారంటూ ఎవరు లేరని రాజకీయ పరిస్థితులు విశాఖ నగరంలో ఒక‌లా… రూరల్ మరోలా ఉంటాయని చెప్పారు. పార్టీ అధినేత జగన్ నగర ప్రజల అభిమానం ఎలా ? పొందాలి అనే దానిపై ఆలోచన చేస్తున్నారని… తొమ్మిదేళ్లపాటు ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానించినా… రెచ్చగొట్టినా సహనంతో ఉండి అధికారంలోకి వచ్చామని… కార్యక‌ర్తలు అన‌వ‌స‌రంగా రెచ్చిపోవ‌ద్దన్నారు.మరోవైపు మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం వచ్చే జీవీఎంసి ఎన్నికల్లో నగరంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారిలో కొందరికి అయినా కార్పొరేటర్ సీట్లు అనిపించుకోవాలని ఆలోచనలో ఉన్నారు. జిల్లా మంత్రిగా న‌గ‌రంపై ఆధిప‌త్యం కోసం ఆయ‌న చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ఎంపీ ఎంవివి సత్యనారాయణ సైతం న‌గ‌రంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. నగరంలో వైసీపీ నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే రూరల్ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం నగర‌ పార్టీ నేతలను టార్గెట్ చేసేలా మాట్లాడుతూ ఆధిపత్యం సాధించాలని ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే విశాఖ నగర వైసిపి రాజకీయాల్లో అప్పుడే ఆధిపత్య పోరు ప్రారంభమైందని తెలుస్తోంది.

No comments:

Post a Comment