Breaking News

12/07/2019

రైల్వేల్లో ప్రైవేట్ సేవలు

హైద్రాబాద్, జూలై 12(way2newstv.in)
దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్ల నిర్వహణ, కొన్నిరకాల సేవల ప్రయివేటీకరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైల్వే స్టేషన్లు ప్రయివేటు పరం కానున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఐఆర్‌ఎస్‌డీసీ)కు అప్పగించారు. ఇప్పటి వరకు రైల్వే శాఖ నిర్వహిస్తున్న ప్లాట్ ఫాం టికెట్ల విక్రయాలు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ఇక నుంచి ప్రయివేటు సంస్ధలు నిర్వహించనున్నాయి. వీటి నిర్వహణ కోసం రైల్వే శాఖ ఐఆర్‌ఎస్‌డీసీ ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ల విక్రయాలతో పాటు మూడు, నాలుగు రకాల సేవలను ఐఆర్‌ఎస్‌డీసీ ద్వారా ఓ కాంట్రాక్టరుకు కొద్దిరోజుల క్రితం అప్పగించారు. దేశంలో ఇతర జోన్లలోనూ కొన్ని స్టేషన్లను ఐఆర్‌ఎస్‌డీసీకి అప్పగించారు.
రైల్వేల్లో ప్రైవేట్ సేవలు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరికొన్ని స్టేషన్లనూ ఈ జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రోజుకు 230 రైళ్ల రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 1లక్షా 80 వేల మంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నిర్వహణ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళుతుండటాన్నినిరసిస్తూ బుధవారం జులై 10న ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.స్టేషన్లో విధులు నిర్వహంచే హెల్త్ ఇన్సెక్టర్లు, కళాసీలు వంటి సిబ్బందిని ఇతర విభాగాలకు పంపించారు. వీరు ఇప్పటి వరకు స్టేషన్లో మంచి నీటి పరీక్షలు, ఆహార నాణ్యాత పరీక్షించేవారు. వీటిని ఇప్పుడు ప్రయివేటుకు అప్పగించారు. రైళ్లలో బెడ్‌రోల్స్‌ను గతంలో  రైల్వే శాఖ అందించేది. తర్వాత వాటిని  ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. వీరు.. వాడిన బెడ్‌రోల్స్‌, టవళ్లను ఉతక్కుండానే మడత పెట్టి మళ్లీ ప్రయాణికులకు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేషన్లలోనూ ప్రైవేటు సంస్థలను అనుమతిస్తే సేవలు ఇలాగే నాసిరకంగా మారుతాయి’’అని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే ఉద్యోగులు పనిచేసే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లను తగ్గించి.. వాటి స్ధానంలో ప్రైవేటు సంస్థలు విక్రయించే టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు పెంచారు.  సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉన్న వాహనాల పార్కింగ్‌తో  సహా అన్ని రకాల పార్కింగ్‌లను, స్టేషన్‌లో షాపులు, హోటల్స్, లీజుకు ఇచ్చే కమర్షియల్ ప్లేస్, టాయిలెట్లను కూడా రైల్వేశాఖ ఐఆర్‌ఎస్‌డీసీకి అప్పగించినట్లు తెలిసింది. ఐఆర్‌ఎస్‌డీసీ ద్వారా లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థలు తిరిగి సబ్‌లీజ్‌ల ద్వారా మరికొన్ని ప్రైవేటు సంస్థల్ని తెరపైకి తెస్తున్నట్లు రైల్వే ఉద్యోగులు అంటున్నారు.

No comments:

Post a Comment