Breaking News

19/07/2019

అమల్లోకి మున్సిపల్ చట్టం

సింగిల్ విండోలో ఇంటి నిర్మాణాలను అనుమతులు
10 శాతం పచ్చదనానికి నిధులు
పట్టణాల పరిశీలనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్
హైద్రాబాద్, జూలై 19(way2newstv.in
తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త మున్సిప‌ల్ చట్టం అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఈ నూతన చట్టంపై శాసనసభ చర్చించింది. శాసనమండలి కూడా నూతన మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర పడింది. ఇంతకీ కొత్త చట్టంలోని స్పెషాలిటీస్ ఏంటి?  ఏయే అంశాలను కొత్తగా ఈ చట్టంలో పొందుపర్చారు? మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. పురపాలనలో భారీ సంస్కరణలు తేవాలని నిర్ణయించింది. అవినీతి ర‌హిత పాల‌న అందించేందుకు కొత్త చట్టాన్ని అస్త్రంగా సంధించబోతోంది. మున్సిప‌ల్ యాక్ట్ పై సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..కొత్త చ‌ట్టంలో క‌లెక్టర్లకు విస్తృత అధికారాలు క‌ల్పించారు. 
అమల్లోకి మున్సిపల్ చట్టం

పచ్చదనం కోసం ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ బడ్జెట్ కేటాయించాల‌ని కొత్త చ‌ట్టం సూచిస్తోంది. గ్రీన్ సెల్స్ ఏర్పాటు చేస్తూ... మున్సిప‌ల్ బ‌డ్జెట్‌లో 10 శాతం నిధులు ప‌చ్చద‌నానికి వెచ్చించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ల‌క్ష్యాల‌ను చేరుకోని వారిపై చ‌ర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టింది. ప‌ట్టణాల ప‌రిశీల‌న‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ ల‌ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం కల్పించడంతోపాటు... మున్సిప‌ల్  ఛైర్మన్ సహా స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని క‌లెక్టర్ల ప‌రిధిలోకి తెచ్చింది. జిల్లాల్లో కొత్త లే అవుట్లకు క‌లెక్టర్ ఛైర్మన్‌గా అప్రూవ‌ల్ క‌మిటీ ఏర్పాటు చేయ‌బోతోంది. ఇందులో స‌భ్యులుగా పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ అధికారులకు అవకాశం కల్పించనుంది.మున్సిపాల్టీల్లో ఇళ్ల నిర్మాణాల అనుమతులను ఇకపై సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వబోతోంది. ఇంటి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు పొందుప‌రిచి ఫీజు చెల్లిస్తే.... తాత్కాలికంగా అనుమ‌తి ల‌భించినట్లే భావించి నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తోంది. అనుమ‌తి ఇచ్చిన స‌మాచారాన్ని కూడా ఆన్ లైన్‌లోనే ప‌రిశీలించుకోవ‌చ్చు. మునిసిపాలిటీల్లో జరిగిన తీర్మానాలను, జారీ చేసిన ఆదేశాలను, ఇచ్చిన అనుమతులను, లైసెన్సులను రద్దు చేసే అధికారాన్ని కొత్త చ‌ట్టం ప్రకారం కలెక్టర్లకు అప్పగించింది. ప‌ట్టణాల్లో సరైన పాలన అందించేందుకు అధికారులకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వబోతోంది. మున్సిపాలిటీలు సొంతంగా ఆర్థిక వనరులను పెంచుకునేందుకు... క్రెడిట్ రేటింగ్, బాండ్ల ద్వారా నిధులు సమీకరణ అవ‌కాశాన్ని క‌ల్పించింది. అన్ని మున్సిపాలిటీలకు విధిగా మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం, సమగ్ర మంచినీటి - పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటును కొత్త చట్టం ద్వారా కల్పించబోతోంది.పురపాలక ఆస్తి పన్ను వసూళ్లలోనూ సంస్కరణలకు కొత్తచట్టం ద్వారా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప‌న్నులు స‌కాలంలో రాబ‌ట్టేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యలను చేప‌ట్టాల‌ని సూచిస్తోంది. అవ‌స‌ర‌మైన భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సేక‌రించేలా కొత్త చ‌ట్టాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రూపొందిన ఈ నూతన మున్సిపల్ చట్టాన్ని 2019, జులై 19వ తేదీ శుక్రవారం శాసనసభ, శాసనమండలి ఆమోదించనున్నాయి.

No comments:

Post a Comment