Breaking News

11/07/2019

ఆర్మూర్ కు దూరంగా కవిత

నిజామాబాద్, జూలై 11, (way2newstv.in)
ఆమె యూత్ ఐకాన్ పార్టీలోనూ కింగ్ మేకర్ ఆమె వస్తున్నారంటే చాలు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఫుల్ అలెర్ట్ అవుతారు. ఆమె మెప్పు పొందేందుకు ఎమ్మెల్యే పోటీ పడి మరీ, కార్యక్రమాలు చేస్తారు. ఐతే కొద్ది రోజులుగా ఆ జిల్లాలో సీన్ రివర్సయ్యింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు సైతం మొక్కుబడిగా సాగుతోంది. ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఫలితంగా క్యాడర్‌లోను నిరుత్సాహం అలుముకుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఆమె మౌనం పార్టీకి నష్టం చేకూర్చేలా మారిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆమె వస్తేనే పార్టీ గాడిలో పడుతుందని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ జిల్లాకు ఆమె ఎందుకు వెళ్లడం లేదు..? ఇప్పుడు ఎక్కడున్నారు..? సభ్యత్వ నమోదుకు ఆమె రాకకు సంబంధం ఏంటి...? తెలంగాణ బతుకమ్మగా ముఖ్యమంత్రి కూతురిగా అందరికీ సుపరిచితురాలు కల్వకుంట్ల కవిత. 
ఆర్మూర్ కు దూరంగా కవిత

నిజామాబాద్ ఎంపీగా ఐదేళ్ల పాటు సేవలందించి జిల్లా అభివృద్దిలో కీలకపాత్ర పోషించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చి సమన్వయంతో ముందుకెళ్లేవారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను అన్నీతానై క్లీన్ స్వీప్ చేయించారు. కవిత జిల్లాకు వస్తున్నారంటే చాలు, టీఆర్ఎస్ శ్రేణుల్లో సందడే సందడి ఉండేది. గులాబీ పండగను తలపించేలా కవిత కార్యక్రమం నిర్వహించేవాళ్లు జిల్లా నేతలు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. కవిత ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. ఓటమి తర్వాత, హైదరాబాద్‌కే పరిమితమయ్యారు కవిత. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. Aకేవలం ట్విట్టర్ వేదిక ద్వార తన అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు కవిత. ఆమె జిల్లాకు రాకపోవడంతో, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది. ముందుకు నడిపించే నాయకురాలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు. కవితక్క లేని లోటు జిల్లా పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల నూతన పార్టీ భవన నిర్మణాలకు శంకుస్ధాపన చేపట్టింది. జిల్లాలోను ఆ కార్యక్రమం అట్టహాసంగా సాగినా, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డిని కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, పార్టీలో టాక్ నడుస్తోంది. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి సైతం స్పీకర్ బాధ్యతల్లో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ ముందుకు నడిపించే కవిత, జిల్లాకు రాకపోవడం వల్ల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు జిల్లాలో అంతంత మాత్రంగా సాగుతోంది. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు అంతగా పట్టించుకోవడం లేదని, పార్టీలో చర్చ జరుగుతోంది. కవిత ఉండి ఉంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పండగ వాతావరణంలో జరిగేవని సీనియర్ నేతలు అధిష్ఠానానికి మొర పెట్టుకున్నారంట. ప్రస్తుతం జిల్లా మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నా, ఆయన తన నియోజకవర్గంపైనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారట. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కవిత జిల్లాకు వస్తేనే, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉందని, ఆమె మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోతే, నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నుంచి హైదరాబాద్‌కు పరిమితమైన కవిత, జిల్లాకు ఎప్పుడొస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏదైనా మంచి పదవితోనే ఆమె జిల్లాలో అడుగుపెడతారని పార్టీలో టాక్ నడుస్తుండగా, ఆ పదవి ఏంటన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాకు పెద్ద దిక్కుగా మారిన మాజీ ఎంపీ కవిత, జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే శ్రేణుల్లో నూతనోత్సాహాం వస్తుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఆమె జిల్లాకు వస్తారా రారా అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు మాత్రం కోరుతున్నారు. మరి కార్యకర్తల మొర కవిత ఆలకిస్తారా?

No comments:

Post a Comment