కరీంనగర్, జూలై 17, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పై స్పందించారు. ప్రస్తుతం తక్కువ వర్షాలు పడుతున్నప్పటికీ, గోదావరిలో ఏమాత్రం వరదరాని సీజన్ లో కూడా ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 5 మోటార్ల ద్వారా లిఫ్ట్ చేశామని తెలిపారు. దీనిద్వారా గత 10 రోజుల్లో 11 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి నిల్వచేశామని అన్నారు.ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే రాష్ట్రంలోని బీళ్లన్నీ గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతాయని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డకు 11 టీఎంసీల నీరు
ఉద్యమ నాయకుడే(కేసీఆర్) ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు ఈ లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.'కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతల జరుగుతోంది. ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టీఎంసీలు నిల్వచేయడం జరిగింది. ఇప్పటికే పట్టిన నీటితో లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలవుతాయి. అన్ని మోటార్లు ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై తరహా నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చు. దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి ఎదురయ్యే ఛాన్సే లేదని' కేటీఆర్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment