Breaking News

26/06/2019

అంతులేని అక్రమాలు (కర్నూలు)

కర్నూలు, జూన్ 26  (way2newstv.in):  
నాపరాతి గనుల తవ్వకాలు, తరలింపు ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వాటి యజమానులు అక్రమార్జనకు తెగబడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్ల పక్కనే నిబంధనలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలు చేపట్టడం, వాటి వృథా రాళ్లను రోడ్లపై వేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ప్రధానంగా బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, గడివేముల, నందికొట్కూరు, డోన్‌ మండలాల్లో నాపరాతి గనులు, తెల్లరాయి గనులు ఉన్నాయి. ఈ మండలాల్లో గనుల యజమానులు ఏంచేసినా, తవ్వకాలు ఎలా జరిపినా, అక్రమంగా ఎంత తరలించినా పట్టించుకొనే దిక్కులేకుండా పోయింది.జిల్లాలో సుమారు 1,250 హెక్టార్లలో నాపరాతి గనులు ఉన్నాయి. ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలోనే 1050 హెక్టార్లలో ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. యజమానులు లీజులు తీసుకున్నది కొంతైతే చుట్టుపక్కల భారీ స్థాయిలో తవ్వకాలు సాగించడం పరిపాటిగా మారింది. ఒక్కో హెక్టారుకు ఏడాదికి డెడ్‌ రెంటు కింద సుమారు రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 
 అంతులేని అక్రమాలు (కర్నూలు)

లీజు లేకుండా తవ్వకాలు సాగించడంతో గుంతలు ప్రమాదకరంగా మారడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అక్రమ తవ్వకాలతో ఏటా సుమారు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 1961 గనుల శాఖ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు, రైల్వేలు, ఇళ్లు, తదితర స్థలాల వద్ద సుమారు 45 మీటర్ల లోపలే గనుల తవ్వకాలు సాగించాల్సి ఉంది. కాలువలు, చెరువులు, ఇతర నీటి వసతి ఉన్నచోట 9 మీటర్లు వదలాల్సి ఉంది. అయితే రహదారుల వరకు తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.గనుల్లో మంచి రాయిని తీశాక పనికిరాకుండా వదిలేసిన రాళ్లు నిత్యం వందల ట్రాక్టర్ల మేర పోగవుతున్నాయి. 23 మండలాల పరిధిలో రోజుకు 50 వేల చదరపు మీటర్ల తవ్వకాలు సాగిస్తుండగా అందులో 40% వరకు వృథా ఉంటున్నట్లు అంచనా. వీటిని అప్పటికే గనులు తవ్వి వదిలేసిన గుంతల్లో వేయాల్సి ఉంది. అయితే యజమానులు రహదారులపైనే వదిలేస్తున్నారు. ఇలా నిత్యం వందల ట్రాక్టర్ల రాయిని వదిలేసిపోతున్నారు. దీంతో అంతంత మాత్రంగానే ఉన్న రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. ప్రధాన రహదారులు మొదలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులను సైతం వదలకుండా వీటితో నింపేస్తున్నారు. దీంతో ప్రజలకు, వాహనదారులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు.గనుల నుంచి వచ్చే వృథా రాళ్లు ప్రమాదాలకు నిలయంగా మారిపోయాయి. వృథా రాయిని నిత్యం ట్రాక్టర్లలో తెచ్చి రహదారులకు ఇరువైపులా వదిలేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందింగా మారిపోయింది. ఎదురెదురుగా వాహనాలు వస్తే కనీసం పక్కకు వెళ్లే వీలుండటం లేదు. వేగంగా వస్తే వాహనాలు ఢీకొనే పరిస్థితి. పలుకూరు, బనగానపల్లి ప్రాంతాల్లో రహదారి పక్కనే ఉన్న గుంతల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు బోల్తాపడిన ఘటనలు ఉన్నాయి. ఇదే సమయంలో అక్రమంగా వాహనాల్లో మోతాదుకి మించి తరలిస్తుండటంతో రహదారులు పనికిరాకుండాపోయాయి. ప్రధానంగా రాత్రివేళల్లో అక్రమ రవాణా సాగుతోంది. నాపరాళ్లు ట్రాక్లర్ల నిండా వేసుకున్న వెళ్తుండగా గుంతలు పడిన రహదారుల్లో జారి కింద పడుతున్నాయి. వెనుకవచ్చే వాహనాల ప్రమాదాలకు కారణమవుతోంది.

No comments:

Post a Comment