Breaking News

25/06/2019

ఆటు పోట్ల సాగు(కృష్ణా)

తిరువూరు, జూన్ 25  (way2newstv.in): 
మెట్టప్రాంతమైన పశ్చిమకృష్ణా పరిధిలోని రైతులు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. చెరువులు, వాగులు, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ విద్యుత్తు మోటార్లు, సాగర్‌ కాలువల ద్వారా సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి వనరుల్లో నీరు పుష్కలంగా ఉండటం వల్ల గట్టెక్కుతున్నవారు రబీ సీజన్‌లో మాత్రం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. సాగర్‌ జలాల విడుదలపై ఆశలు పెట్టుకొని పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేఆర్‌ఎంబీ ఎడమ కాలువ పరిధిలోని జోన్‌-2, జోన్‌-3కి నీటిని కేటాయిస్తోంది. ఈ మేరకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. రబీలో సాగునీరు, వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు దోహదం చేయనుంది.రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో కూడా ఎగువ ఉన్న తెలంగాణ నుంచి సాగర్‌ జలాలు జిల్లాకు రప్పించే విషయంలో పోరాటాలు చేయాల్సి వచ్చేది. రాష్ట్రం విడిపోయిన తరువాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు జిల్లా రైతులకు ఊరటనిచ్చింది. 
ఆటు పోట్ల సాగు(కృష్ణా)


ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తూ కృష్ణా, గోదావరి జలాలు ప్రతి చుక్క సద్వినియోగం చేసుకుంటూ సాగునీటి అవసరాలు తీర్చుకుందామని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయిలో సాగర్‌ జలాలు విడుదల చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.పశ్చిమకృష్ణా పరిధిలోని నూజివీడు, తిరువూరు, మైలవరం, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల చుట్టూ సాగర్‌ కాలువలు విస్తరించి ఉన్నాయి. రబీ సీజన్‌లో భాగంగా సాగు చేసే రెండో పంటకు ఈ జలాలు విడుదల చేయాల్సి ఉంది. సాగునీటి అవసరాల నిమిత్తం నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు, తాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టులో నీటి మట్టాన్ని పరిగణనలోకి 
తీసుకుంటూ ఏప్రిల్‌ నుంచి మే వరకు నిల్వ ఉన్న 14 టీఎంసీల నీటిని విడతల వారీగా చేయాలి. సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం ఏటా అక్టోబరులో జలవనరుల శాఖ అధికారులు సాగర్‌ జలాల రబీ షెడ్యూల్‌ను తయారు చేసి, కృష్ణానది నీటి యాజమాన్య సంస్థకు సమర్పిస్తుంది. సాగర్‌ జలాలు విడుదల చేసిన ప్రతిసారీ జిల్లా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. దాదాపు 281 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఈ జలాలు జిల్లాను పలకరిస్తాయి. ఎగువన ఉన్న ఖమ్మం జిల్లాను దాటి రావాల్సిన నేపథ్యంలో కేటాయింపుల మేరకు జిల్లాకు సరఫరా జరగడం లేదు. ఎగువన ఉన్న సాగుదారులు కాలువలకు అడుగడుగునా గండ్లు పెట్టి నీటిని మళ్లించడం, ఆవిరి రూపంలో కొంత నష్టపోవడం వంటి కారణాలతో సరిహద్దుకు చేరే సరికి అపసోపాలు పడాల్సి వస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తావిస్తోంది. ఈ పంచాయితీ ఏటా కృష్ణానది నీటి యాజమాన్య సంస్థ వద్దకు చేరుతోంది. ఎగువన అక్రమంగా నీటిని వినియోగించడం వల్ల తమ రైతులకు అన్యాయం జరుగుతోందని, సరిహద్దుకు చేరిన నీటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన జలవనరుల శాఖ అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.కృష్ణా నీటి యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) సూచనల మేరకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో విస్సన్నపేట మండలం నూతిపాడు 101.306 కిలోమీటరు వద్ద టెలీమీటర్‌ పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరిహద్దుకు చేరిన నీటిని కొలిచి, ఎంత మేరకు సరఫరా జరిగిందనేది నిర్ధరించుకుంటున్నారు. గత మూడేళ్లుగా సాధ్యమైనంత ఎక్కువ నీటిని రాబట్టేందుకు వీలు కలిగింది. అయినప్పటికీ కేటాయింపుల మేరకు సాగర్‌ జలాలు విడుదల చేస్తూ జిల్లా రైతుల సాగునీటి సమస్య అధిగమించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో జోన్‌-2, జోన్‌-3 సాగర్‌ కాలువల ఆయకట్టులో 2.10 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ జలాల రబీ షెడ్యూల్‌ ప్రకారం ప్రతి నెలా నీటిని విడుదల చేయాల్సి ఉంది. పంట చేతికొచ్చే సమయంలో నీటి విడుదలపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రతిఏటా రైతులు పంట నష్టాలను నవిచూడాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రం సానుకూల దృక్పథం వ్యక్తం చేసిన నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం కేటాయింపుల మేరకు నీటిని రాబట్టే విషయంలో నూతన ప్రభుత్వం చొరవ చూపితే పశ్చిమకృష్ణా సస్యశ్యామలమవుతుంది.జోన్‌-2, జోన్‌-3 పరిధిలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు ప్రతి ఏటా 14 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గడిచిన పదేళ్లలో విడుదల చేసిన నీటి వివరాల గణాంకాలను పరిశీలిస్తే ప్రతిఏటా సగటున 5.70 టీఎంసీలు మాత్రమే ఆంధ్రాకు చేరాయి. ఫలితంగా జిల్లా రైతాంగం సగటున 8.30 టీఎంసీల నీటిని కోల్పోయింది. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాల ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారుల కృషి ఫలితంగా చివరి మూడేళ్లలో సాగర్‌ జలాల విడుదల ఆశాజనకంగా ఉంది. తరచూ కృష్ణానది యాజమాన్య సంస్థను కలిసి వినతి పత్రాలు అందజేస్తూ సాగర్‌ జలాలను సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టే విషయంలో సఫలీకృతులయ్యారు. 2016లో 10.57, 2017లో 9.80, 2018లో 11.20 టీఎంసీల చొప్పున సాగర్‌ జలాలు విడుదల చేయడంతో సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు దోహదం చేసింది. 2012, 2015 సంవత్సరాల్లో చుక్కనీటిని కూడా విడుదల చేయలేదు.సాగర్‌ జలాల విడుదల ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ నిర్మాణ పనులను చేపట్టింది. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ, గోదావరి జలాల మళ్లింపుకు శ్రీకారం చుట్టింది. పథకం నిర్మాణం, కాలువల విస్తరణ పనులు 60 శాతం పైగా పూర్తి చేశారు. కృష్ణాజిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రాగా, పశ్చిమగోదావరి జిల్లాలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల నిర్మాణ పురోగతికి అవరోధంగా మారింది. ఒకవైపు సాగర్‌ జలాలు, మరోవైపు గోదావరి జలాలు సరఫరా చేస్తే పశ్చిమకృష్ణా ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం కానుంది. గోదావరి జలాలతో ఖరీఫ్‌, సాగర్‌ జలాలతో రబీ సీజన్‌లో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి వనరులను ఆధునికీకరించడంతో పాటు సాగర్‌, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే రైతన్నల కన్నీటి కష్టాలకు మోక్షం లభించనుంది.

No comments:

Post a Comment