Breaking News

25/06/2019

అటకెక్కినట్లేనా..!(పశ్చిమగోదావరి)


ఏలూరు, జూన్ 25  (way2newstv.in): 

జిల్లాలో కాలువల ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. నిధులు మంజూరైనా పనులు చేయడానికి సాగునీటి సంఘాల అధ్యక్షులు ఆసక్తి చూపించక పోవడంతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో 29 మండలాల్లో డెల్టా ప్రాంతం విస్తరించి ఉంది. 11 ప్రధాన కాలువలు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 356.8 కిలోమీటర్లు. వీటి ద్వారా 5.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. అలాగే 21 మేజరు డ్రెయిన్లు, 59 మీడియం డ్రెయిన్లు, 579 మైనరు డ్రెయిన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏటా ఓ అండ్‌ ఎం పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఈ ఏడాది (2019-20 ఆర్థిక సంవత్సరం) కాలువలకు సంబంధించి 289 పనులకు రూ. 6.66 కోట్లు, డ్రెయిన్లకు సంబంధించి  289 పనులకు రూ. 8.63 కోట్లు, మొత్తంగా 519పనులకు రూ.15.29 కోట్లు మంజూరయ్యాయి.కాలువల్లో ఏ అడ్డంకి లేకపోతేనే శివారు భూములకు కూడా సక్రమంగా నీరు అందుతుంది. 
అటకెక్కినట్లేనా..!(పశ్చిమగోదావరి)

ఏటా నీరు పారే కాలువల్లో గుర్రపుడెక్క, తూడు పెరిగిపోతూ ఉంటుంది. ఓ అండ్‌ ఎంలో వాటి తొలగింపు పనులు చేస్తుంటారు. ఏటా నీరు పారే సమయంలో చెత్తచెదారం పేరుకుపోతుంటుంది. దానికితోడు పూడిక నిలిచిపోతోంది. వీటిని తొలగిస్తుంటారు. 11 నెలలపాటు నీటిలో ఉండడం వల్ల లాకులకు తుప్పు పట్టడం వంటివి జరుగుతుంటాయి. వాటికి గ్రీజు, తారు, ఆయిలింగు చేస్తుంటారు. షట్టర్లు బలహీనంగా ఉంటే మరమ్మతులు చేయడం కానీ, మార్చడం కానీ చేస్తుంటారు. గట్లు ఎక్కడైనా బలహీనంగా ఉంటే వాటిని చక్కదిద్దుతారు. ఏది ఏమైనా సీజనులో సాగునీటికి అవరోధం లేకుండా చేయడానికి ఏది అవసరమైతే అది చేస్తారు. సీజనులో అత్యవసరమైన పనులు చేస్తుంటారు.ఆసక్తి చూపించని సాగునీటి సంఘాలు.. ఈ ఏడాది నిధులు మంజూరైనా సాగునీటి సంఘాధ్యక్షులు ఆసక్తి చూపించలేదు. సాగునీటి సంఘాల ఎన్నికలు 2015లో జరిగాయి. 200కు పైగా సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. అప్పట్లో అందరూ తెదేపాకు చెందినవారే ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ పనులు చేసినా బిల్లులు వస్తాయో రావోనని పనులు చేయలేమని చెప్పేశారు. ఓ అండ్‌ ఎం పనులంటే కాలువలకు నీరు నిలిపివేసిన మే, జూన్‌ నెలల్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల కారణంగా అంచనాలు ముందే తయారు చేసినా ఎన్నికల నియమావళి ముగిసిన తరవాత పంపించారు. ఇటీవలే వీటి మంజూరుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. పనులు చేస్తే వాటికి సంబంధించి బిల్లులు పెడితే తరవాత నిధులు విడుదల అవుతాయి. ఇప్పుడే సీజను కాబట్టి పనులు చేయాలని సాగునీటి సంఘాల అధ్యక్షులను జలవనరులశాఖాధికారులు కోరినా ససేమిరా అంటున్నారు. గతేడాది కాలువలకు సంబంధించి 253 పనులకు రూ. 7.85 కోట్లు, డ్రెయిన్లకు సంబంధించి 275 పనులకు రూ. 7.49 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు గతేడాది చేశారు. కానీ వీటి బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ఈ పనులు సాగునీటి సంఘాల అధ్యక్షులే చేయాలి. వీరంతా ఆసక్తి చూపించక పోవడంతో సమస్యను జలవనరులశాఖాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే వచ్చే ఆదేశాల ఆధారంగా చేయాల్సి ఉంటుంది. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేయాల్సి ఉండడం, వీరంతా ఆసక్తి చూపించక పోవడం, కొత్తవాటిని ఎన్నుకోవడం ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. దాంతో ఈ ఏడాది పనులు ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment