Breaking News

28/06/2019

రాజీనామాపై రాజ్ గోపాల్ రెడ్డి తర్జన భర్జనలు


హైద్రాబాద్, జూన్ 28,  (way2newstv.in)
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కమలం తీర్థం పుచ్చుకోవడం కన్‌ఫామ్ అయ్యింది. ఇక అధికారికంగా బీజేపీలోకి వెళ్లడమే నెక్ట్స్ స్టెప్. స్వయంగా ఆయనే ఈ ప్రకటన చేశారు. అయితే కమలం తీర్థం పుచ్చుకోవడం వెనక రాజగోపాల్‌కు చాలా లెక్కలున్నాయి పార్టీ మారడం వెనక అసలు కథ వేరే ఉంది ఇంతకీ ఏంటది కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. స్వపక్షంలో విపక్ష నాయకుడు. నిత్యం పీసీసీని, రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యులపై ఘాటైన విమర్శలు చేసే లీడర్. పార్టీ మార్పు ఊహాగానాలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు..కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారడం కన్‌ఫామ్ అని తేల్చేవారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా, కాంగ్రెస్‌కు కంచు కోట. కానీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

రాజీనామాపై రాజ్ గోపాల్ రెడ్డి తర్జన భర్జనలు

ఇప్పుడాయన కూడా మూటాముళ్లె సర్దుకుని, గాంధీభవన్‌పై రాళ్లు విసిరి, కమలం వైపు అడుగులేస్తున్నారు. కాషాయతీర్థం పుచ్చుకోవడం వెనక రాజగోపాల్‌ లెక్కలు వేరే ఉన్నాయి. శాసనసభ ఎన్నికల ముందు పీసీసీ పీఠాన్ని ఆశించారు రాజగోపాల్ రెడ్డి. కానీ భంగపడ్డారు. తనకు కాకపోయినా, తన సోదరుడుకైనా పీసీసీ పోస్ట్ వస్తుందని అనుకున్నారు. అవేమీ నెరవేరలేదు. ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో మరింత నిరాశలోకి కూరుకుపోయారు. తమకు ఎలాగూ కీలక పోస్టులివ్వరు, తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని భావిస్తున్న రాజగోపాల్, కమలం గూటికి వెళితేనే తనకూ మంచి ఫ్యూచర్ అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక సామాజికవర్గం రెడ్లు. వీరిని తమవైపు లాక్కుంటే, ఇక టీఆర్ఎస్‌కు ప్రత్నామ్నాయంగా ఎదగొచ్చని కమలం పెద్దల స్కెచ్. అందులో భాగంగానే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గాలం వేస్తోంది బీజేపీ. ముందు నుంచి కాంగ్రెస్‌ రాష్ట్ర నేతల తీరుపై రగిలిపోతున్న రాజగోపాల్, బీజేపీలో ఉంటే సీఎం అభ్యర్థిగానూ ఫోకస్ కావొచ్చని ఆలోచిస్తున్నారు. అలాంటి హామి తనకు కావాలని కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడారట. కోమటిరెడ్డి రాజగోపాల్‌ బీజేపీలో చేరడానికి మరో ప్రధాన కారణం, ఆర్థిక వ్యవహారాలంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఆరేడేళ్లుగా కాంట్రాక్టులకు బిల్లులు రాక, వ్యాపారం సరిగ్గా లేక ఆర్థికంగా బాగా చితికిపోయిన పరిస్థితుల్లో రాజగోపాల్ ఉన్నారని అంటున్నారు. దీనికితోడు వరుస ఎన్నికలతో మరిన్ని ఆర్థిక కష్టాలు. దీంతో అధికార పార్టీలోకి వెళితే, కాంట్రాక్టులు, ఫైనాన్షియల్‌ పరంగానూ బాగుంటుందని ఆలోచించే రాజగోపాల్ కమలం గూటికి వెళుతున్నారని చర్చ జరుగుతోంది. ఇలా సీఎం అభ్యర్థి లేదంటే మరో కీలకమైన పదవి, ఆర్థిక వెసులుబాటు వంటి లెక్కలను పక్కాగా చూసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్, పార్టీ మారుతున్నారని ఢిల్లీ రాజకీయాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఈ లెక్కలన్నీ పక్కనపెడితే, మరో కీలక సవాల్‌ రాజగోపాల్ ముందుంది. రాజగోపాల్ పార్టీ మారుతున్నారు కాబట్టి, మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. లేదంటే ఫిరాయింపుల నిరోధక చట్టంతో అనర్హత వేటు పడినా పడుతుందని, అప్పుడు పరువు కూడా పోతుందని ఆందోళన చెందుతున్నారట రాజగోపాల్‌తో పాటు ఆయన అనుచరులు. అమిత్‌ షా, రాంమాధవ్‌లతో జరిగిన మీటింగ్‌లోనూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ సైతం చెప్పారట. అయితే ఇప్పటికిప్పుడు మునుగోడుకు ఎన్నికలు జరిగితే, గెలవడం కష్టమన్న భావన వ్యక్తం చేశారట కమలం పెద్దలు. అందుకే రాజీనామా చేయొద్దని చెప్పారట. దీంతో రాజీనామాపై అయోమయంలో పడ్డారట రాజగోపాల్. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, చేయకపోయినా, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే మాత్రం, బైపోల్‌ వచ్చితీరడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే, మునుగోడును తిరిగి గెలవడం రాజగోపాల్‌కు సవాలే. ఎందుకంటే, మళ్లీ గెలిచి, విజయంతో సగర్వంగా బీజేపీలోకి వెళితేనే రాజగోపాల్‌కు పేరొస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం, ఆదిలో హంసపాదులా రాజగోపాల్‌కు కమలంలో పరపతి కష్టమే. అందులోనూ సీఎం పీఠంపై కలలు కంటున్న రాజగోపాల్‌కు, మునుగోడు గెలవకపోతే, రెంటికి చెడ్డ రేవడి చందమే. అందుకే రాజీనామాపై తర్జనభర్జన పడుతున్నారట రాజగోపాల్. మొత్తానికి అన్ని లెక్కలు సరిచూసుకుని కమలం గూటికి చేరాలనుకుంటున్న రాజగోపాల్‌, రాజీనామా వ్యవహారంతో సతమతమవుతున్నారు.

No comments:

Post a Comment