Breaking News

18/06/2019

సొమ్ములేవీ..? (కరీంనగర్)

కరీంనగర్, జూన్ 18 (way2newstv.in): 
కరువు పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు మొండి చేయి చూపాయి. సీడ్‌(ఆడ, మగ)ను తీసుకెళ్లి.. పది రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 40రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో చేతిలో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు గత్యంతరం లేక ప్రైవేటు అప్పును ఆశ్రయిస్తున్నారు. రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48వేల ఎకరాల్లో హైబ్రీడ్‌ వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 8వేల ఎకరాలలో పంట ఎండిపోయింది. సుమారు 2.52లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది.ఈ లెక్కన రూ.100కోట్లు రైతులకు కంపెనీలు బకాయి పడ్డట్లు సమాచారం. రాష్ట్రంలోనే హైబ్రీడ్‌(ఆడ, మగ)సీడ్‌ వరి సాగులో కరీంనగర్‌ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నేలలు అనువుగా  ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. 30 ఏళ్లుగా ఇక్కడి రైతులు హైబ్రీడ్‌ వరిని సాగు చేస్తున్నారు.

సొమ్ములేవీ..? (కరీంనగర్)
ప్రతీ కంపెనీ రైతుల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించడం లేదు. రెండు మూడు కంపెనీలు మాత్రమే రైతులకు చెక్కు రూపంలో ఇస్తున్నాయి. మిగిలిన కంపెనీలు తమ ఏజెంట్ల ఖాతాలో జమ చేస్తున్నాయి. దీంతో ఏజెంట్లు డబ్బులను తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే కరువుతో గత మూడేళ్లుగా ఆశించిన దిగుబడి లేక రైతులు కుదేలయ్యారు. ఇప్పుడు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా కంపెనీలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.శ్రమకు తగిన ఫలితం లేక రైతులు కుదేలవుతున్నారు. క్వింటాల్‌కు రూ.4వేల నుంచి 8వేల వరకు చెల్లిస్తుండడంతో సీడ్‌ వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ ఖరీఫ్‌ ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. సీడ్‌ కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10కిలోల చొప్పున తరుగు పేరుతో నిలువు దోపిడీకి దిగుతున్నారు. ఈ లెక్కన అదనంగా రూ.800 నష్టపోతున్నారు. అదేవిధంగా కాంటాలలో 4నుంచి 5కిలోల వ్యత్యాసం వస్తుందని రైతులు వాపోతున్నారు.సీడ్‌ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్లు(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనం సాగు చేయిస్తుంటారు. ఇక్కడ డీలర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ మల్టినేషన్‌ కంపెనీ క్వింటాల్‌ రూ.7వేలు చెల్లిస్తుండగా సదరు డీలర్లు రూ.6వేలకే రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన క్వింటాల్‌కు వెయ్యి అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే రైతులను నిలువున ముంచుతూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొన్ని కంపెనీలు నాలుగు రోజుల క్రితం ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారని తెలిసింది. కానీ ఏజెంట్లు తమ స్వంత అవసరాలకు వాడుకొని రైతులకు మొండి చెయ్యి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. హైబ్రీడ్‌ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడుతోపాటు జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 15క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పినా 6 నుంచి 8క్వింటాలలోపు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. ఈ లెక్కన 2.52లక్షల క్వింటాల దిగుబడి వచ్చిందని అంచనా. సుమారు రూ.100కోట్ల పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment