Breaking News

29/06/2019

గుదిబండగా వైసీపీ హామీలు


కమలం వైపు టీడీపీ నేతలు
నెల్లూరు, జూన్ 29, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశం తనకోసం ఎదురుచూస్తోందని బీజేపీ నమ్ముతోంది. ఇక్కడున్న సామాజిక సమీకరణలు, క్రమేపీ ఏర్పడుతున్న ప్రతిపక్ష శూన్యత, వైసీపీ స్వయంకృతాపరాధాలు కలగలిసి తనను గద్దెనెక్కిస్తాయని విశ్వసిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారపక్షాన్ని ముఖాముఖి ఢీ కొట్టేలా టైమ్ బౌండ్ కార్యాచరణ ప్రణాళికను బీజేపీ సిద్ధం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వైసీపీ బలహీనపడుతుందని అంచనా వేస్తోంది. ఈలోపుగానే టీడీపీ డీలాపడిపోతుందని లెక్కలు వేస్తోంది. టీడీపీ కి పెట్టుబడి దారులైన పెద్దనాయకులు, రాష్ట్రంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కమలం పార్టీలో చేరకతప్పదని ఆపార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు. అందుకు అవసరమైన వ్యూహరచనను సైతం ఇప్పటికే రెడీ చేశారు. టీడీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరడం కేవలం మొదటి అడుగు మాత్రమేనంటున్నారు. ఇంకా వందలమంది పెద్ద నాయకులు, ప్రజాప్రతినిధులు కమలం పిలుపు కోసం వేచిచూస్తున్నారు. 

గుదిబండగా వైసీపీ హామీలు

ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు చాలా కంగారుగా భయాందోళనల్లో నలిగిపోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ ఆర్థిక, వ్యాపార సామ్రాజ్యాలపై ఎక్కడ గురిపెడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. వీరికి బీజేపీలో చేరడం మినహా గత్యంతరం లేదు.తెలుగుదేశం పార్టీ కాలంలో విద్యా,వ్యాపార సామ్రాజ్యాలను చాలా మంది విస్తరించుకోగలిగారు. ఆ పార్టీకి ఆర్థిక వనరుగానూ మారారు. నారాయణ అయితే స్వయంగా మంత్రిపదవినే నిర్వర్తించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి వంటి వారు పార్టీకి పెట్టుబడిదారులుగా టీడీపీని పోషించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించడం, అక్రమాలను చూసీచూడనట్లు పోవడం ద్వారా టీడీపీ సర్కారు వీరికి ప్రత్యుపకారం చేస్తుండేది. వీరి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది జగన్ లక్ష్యం. అందుకే నెలరోజులు తిరగకుండానే సుజనా,సీఎం వంటివారు హస్తినలో కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ ఏజన్సీల ద్వారా వారిపై దాడులకు పాల్పడితే కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ కు చెందిన వారిపై దృష్టి పెడతాయి. అందువల్ల వారికి అభయం లభించేసినట్లే. ఇక నారాయణ విద్యాసంస్థలపైనా రాష్ట్రప్రభుత్వం సీరియస్ గానే యోచన చేయవచ్చు. అందుకే ఆ సంస్థ అధినేత సైతం కమలాన్ని కౌగిలించుకోకతప్పదని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇటువంటి బడా పారిశ్రామిక, వ్యాపార,విద్యా వేత్తలను ఆకర్షించడం ద్వారా ఉభయతారకంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. వారి నుంచి లభించే నిధులు, అంగబలం పార్టీ విస్తరణకు దోహద పడుతుంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల కొరత తీరుతుంది.రాజకీయాధికార సామాజిక సమీకరణల్లో కొంత గ్యాప్ కనిపిస్తోందని హస్తినలో బీజేపీ నాయకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు 90 శాతం వైసీపీనే ఆదరించారు. ఎస్సీ, ఎస్టీల్లో సైతం 75శాతం అదే పార్టీకి అండగా నిలిచారు. ముస్లింలలో 68 శాతం వైసీపీకి ఓటేసినట్లుగా శాంపిల్ సర్వేలో పసిగట్టారు. టీడీపీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గం ఒక్కటే బలమైన అండగా నిలుస్తోంది. బీసీల్లో గతంలో 60శాతం పైచిలుకు మద్దతు ఆ పార్టీకి ఉండేది. అది నలభైశాతానికి పడిపోయింది. అయితే బీసీలను ఒక కులంగా ప్రత్యేకించి వర్గీకరించలేం. అగ్రవర్ణాల్లో వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు సామాజిక వర్గాలు ఏ పార్టీకి మెజార్టీ మద్దతు పలకడం లేదు. జనసేన రంగంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సైతం కాపు సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు లభించలేదు. ఈ నాలుగు అగ్రవర్ణాలను ఆకర్షించడంతోపాటు పద్మశాలి, దేవాంగ, కొప్పుల వెలమ, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ వంటి బీసీ వర్గాలకు గాలం వేయగలిగితే బీజేపీ అధికార పక్షానికి సవాల్ విసరగలుగుతుంది. పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్లు ఇప్పటికే తగిన సంఖ్యలో ఉన్న ద్రుష్ట్యా సామాజిక సమీకరణ సమకూరితే చాలు బీజేపీ బలోపేతమైన శక్తిగా నిలుస్తుందని హస్తిన పెద్దల అంచనా.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతిని సహించేది లేదని కఠినంగానే చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల టీడీపీ నాయకత్వం సహజంగానే బలహీనపడుతుంది. అయితే వైసీపీకి నవరత్నాల అమలు, జగన్ తాజాగా ఇస్తున్న హామీలు గుదిబండగా మారతాయని కమలం పార్టీ అధినాయకులు భావిస్తున్నారు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు భారీగా ఇంటరిమ్ రిలీఫ్, సంక్షేమ పథకాలకు నిధులు, అమ్మ ఒడి వంటి పథకాల విస్తరణకు నిధుల సమస్య తలెత్తుతుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మందగిస్తోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం సన్నగిల్లుతుంది. మద్యనిషేధ అమలులో భాగంగా వచ్చే ఏడాదికి ఎక్సైజ్ ఆదాయం అయిదువేల కోట్ల రూపాయల మేరకు తగ్గుతుంది. ఇవన్నీ కలగలిసి వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వం దివాలా తీస్తుందని బీజేపీ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే వైసీపీ ప్రభుత్వం నైతికంగా కొంత బలహీనపడుతుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య క్రెడిబిలిటీ గ్యాప్ ఏర్పడుతుంది. అప్పటివరకూ వేచి చూసి ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రకు బలంగా సిద్దం కావాలని బీజేపీ యోచన.

No comments:

Post a Comment