Breaking News

18/06/2019

హనుమంత వాహనంపై శ్రీ కోదండ‌ రాముడు అభయం


తిరుపతి, జూన్ 18 (way2newstv.in)
అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ‌ రాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 


హనుమంత వాహనంపై  శ్రీ కోదండ‌ రాముడు అభయం
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు కోదండ‌ రాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట - కౌసల్య, చింతచెట్టు - దశరథుడు, శేషాచలం - లక్ష్మణుడు, పర్వతప్రాంతం - అయోధ్య అని పేర్కొనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన శ్రీ కోదండ రాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

No comments:

Post a Comment