Breaking News

14/06/2019

రైతన్న దైన్యం (నెల్లూరు)

నెల్లూరు, జూన్ 14 (way2newstv.in): 
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారుల అంచనాలు.. క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల లెక్కలకు భారీ వ్యత్యాసం ఉంది. రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. పేరుకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా.. వాస్తవానికి దళారుల దందా ఎక్కువగా ఉంది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల 20వ తేదీ తర్వాత మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ధర కోసం రైతుల దగ్గర నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఏం చేయాలి? కొనుగోలు కేంద్రాలు పనిచేయడంతో మిల్లర్లు అడ్డగోలుగా ధరను కోసేయడం లేదు. కొనుగోలు కేంద్రాలు మూతపడితే.. వెంటనే మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధరను నిర్దేశించి రైతులను దోచుకునే పరిస్థితి ఉంటుంది. అధికారుల అంచనా ప్రకారం చూస్తే.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి ఇంకా పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వలు రైతుల ఇళ్లల్లోనే ఉన్నాయి. గత రెండు నెలలుగా ఎన్నికల హడావుడి నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సిబ్బంది పర్యవేక్షణ కూడా అంతగా లేదు. దీంతో కొనుగోళ్లు మొక్కుబడిగా సాగాయి. ప్రస్తుతం కేంద్రాలను మూసివేస్తామని అధికారులు తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

రైతన్న దైన్యం (నెల్లూరు)

జిల్లాలో వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 1.29 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. దిగుబడి అంచనా 9.59 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో అవసరాలు, మిల్లర్లు కొనుగోళ్లు పోను.. పౌరసరఫరాల సంస్థ ద్వారా 3.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందులో సాధారణ రకం 3.16 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఏ గ్రేడ్‌ 70 వేల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 106 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెలుగు, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ద్వారా కొనుగోళ్లను నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి గ్రేడ్‌ ఏ రకం ధాన్యం పుట్టి రూ.15,045 వంతున కొనుగోలు చేస్తే.. సాధారణ రకానికి రూ.14,875 మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. అధికారులు అంచనా వేసిన లక్ష్యంలో కేవలం రెండు లక్షల మెట్రిక్‌ టన్నులను మాత్రమే కొనుగోలు చేయనున్నట్టు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే కొనుగోలు లక్ష్యాన్ని దాదాపు సగానికి తగ్గించారు. ఇప్పటి వరకు ఎన్నికలు.. ధరలు పెరుగుతాయన్న ఆశతో రైతులు ధాన్యం నిల్వ చేసుకున్నారు. ఖరీఫ్‌లో సాధారణ, గ్రేడ్‌ ఏ రకం ధాన్యం కలిపి 5,349 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని సీఎంఆర్‌ ధాన్యం కింద మిల్లర్లకు పంపారు. జిల్లాలో ప్రధానంగా రబీ సాగు ద్వారా వచ్చే ధాన్యం ఎక్కువగా ఉంటుంది. రబీ సీజన్‌లో 1,57,380 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఇందులో కడప జిల్లాలోని రైస్‌ మిల్లులకు 10,499 ఎంటీల ధాన్యం పంపితే... జిల్లాలోని రైస్‌మిల్లర్లకు 1.47 లక్షల ఎంటీలను సీఎంఆర్‌ కింద పంపారు.మిల్లర్లకు పంపిన ధాన్యంలో 67 శాతం వంతున లెక్కిస్తే.. 98,410 ఎంటీల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు మిల్లర్లు 85,092 ఎంటీల బియ్యాన్ని ఇచ్చారు. ఇంకా 13,318 ఎంటీలను ఇంకా ఇవ్వాల్సి ఉంది. అధికారుల సేకరించిన ధాన్యంలో ఎక్కువగా గ్రేడ్‌ ఏ రకం ఉంది. రబీలో 1.57 లక్షల ఎంటీలను సేకరిస్తే.. అందులో 1.50 లక్షలు గ్రేడ్‌ ఏ రకం ధాన్యం ఉండడం గమనార్హం. మిల్లర్లు ఇప్పటికీ గత ఏడాది మాదిరే ధాన్యం ఇవ్వకుండా మళ్లీ దోబూచులాడడం గమనార్హం.

No comments:

Post a Comment