ప్రాధాన్యత రంగాల్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత
హైదరాబాద్ మే 31 (way2newstv.in)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) విడుదల చేసింది. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక మొత్తంతో పోలిస్తే రుణ వితరణ లక్ష్యంలో 6.95 శాతం వృద్ధి కనిపించింది. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు జె.స్వామినాథన్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2018–19 వార్షిక రుణ ప్రణాళిక తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు, 2019–20లో లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు, లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాల్సిందిగా కోరారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ విడుదల చేసింది. 2018–19 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.1.36 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం 6.95 శాతం మేర కేటాయింపులు పెంచారు. రూ.1.01 లక్షల కోట్లతో.. అనగా మొత్తం కేటాయింపుల్లో 69 శాతం ప్రాధాన్యత రంగాలకే కేటాయించారు. ఈ రంగాల్లోనూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది.
రూ.1.46 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన ఎస్‌ఎల్‌బీసీ
గత ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.58.06 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 68.59 వేల కోట్లు వితరణ చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయానిది 68 శాతం వాటా కాగా, గత ఏడాదితో పోలిస్తే 18.14 శాతం మేర అదనంగా రుణ వితరణ జరగనుంది. వ్యవసాయానికి కేటాయించిన రూ.68 వేల కోట్లలో పెట్టుబడి రుణంగా రూ.19,856 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.15,569 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయం తర్వాత సూక్ష్మ, లఘు పరిశ్రమల రంగాని(ఎంఎస్‌ఎంఈ)కి ప్రాధాన్యత ఇస్తూ, రూ.21,420 కోట్లు రుణ వితరణ లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం 21,381 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.29 కోట్ల మేర పెంచుతూ లక్ష్యం ఖరారు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణ వితరణ లక్ష్యంలో 79.43 శాతం అనగా రూ.33,752 కోట్లు మాత్రమే రుణ వితరణ చేశారు. అయితే పెట్టుబడి రుణాల విషయంలో మాత్రం రూ.15,568 కోట్ల లక్ష్యానికి మించి రూ.17,600 కోట్లు మంజూరు చేశారు. రూ.534 కోట్లు విద్యకు, రూ.5,849 కోట్లు గృహ రుణాల రూపంలో ఇచ్చారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల రుణ వితరణలో బ్యాంకర్లు ఏకంగా లక్ష్యానికి మించి రూ. 36,639 కోట్ల మేర అనగా.. 171 శాతం రుణాలిచ్చారు. 1.46 లక్షల మంది మైనారిటీలకు రూ.2,257 కోట్లు, బలహీన వర్గాలకు రూ.15,367 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,930 కోట్లు రుణం ఇచ్చారు. 2018–19లో ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద రూ.6,242 కోట్లు లక్ష్యం కాగా, రూ,7,777 కోట్లు రుణ వితరణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో రూ.95,736 కోట్ల మేర రుణాలిచ్చి 103.22 శాతం లక్ష్యం సాధించారు.
No comments:
Post a Comment