Breaking News

23/05/2019

అన్నీ తానై నడిపించిన మోడీ

న్యూఢిల్లీ, మే 23 (way2newstv.in)

ఎన్నికల ప్రచారం తనకొక తీర్థయాత్రలా ముగిసిందన్నారు ప్రధాని మోడీ. ప్రత్యర్థులపై విరుచుకుపడిన తీరు, వ్యక్తిగత దూషణలు స్తోత్రాలుగా భావించాలేమో. ప్రజాస్వామ్య పండగలో ప్రతి సభనూ పుణ్యక్షేత్రంగా భావించడం మంచిదే. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రచార కాలుష్యం వెదజల్లడం మాత్రం రికార్డుగానే మిగిలిపోతుంది. మరో యాత్రిక్ మన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన తిరగని రాష్ట్రం లేదు. కలవని నాయకుడు లేడు అన్నట్లుగా మారింది. ప్రధానప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ సైతం చూపని చొరవ టీడీపీ అధినేతలో కనిపించింది. ఈ యాత్రల వెనక, చేతల వెనక ఉన్న చంద్రబాబు ఉద్దేశమేమిటన్నది రాజకీయంగా చర్చనీయమవుతోంది. అలాగే మోడీ ప్రకటనలోని ఆంతర్యంపైనా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఫలితాల ప్రకటనలకు సమయం సమీపిస్తున్న వేళలో ఈ పొలిటికల్ టూరిస్టు, పిలిగ్రమిస్టుల పర్పస్ ఏమిటనే దానిపై రకరకాల రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.


అన్నీ తానై నడిపించిన మోడీ

ఎన్డీఏ కూటమిలో ప్రధానపక్షమైన బీజేపీకి సర్వం సహా తానై వ్యవహరిస్తున్నారు నరేంద్రమోడీ. యూపీఏ కూటమిలో రాహుల్ గాంధీ అంతటి కీలకపాత్ర పోషించలేకపోతున్నారు. దేశంలో అటుఇటు కాకుండా కొన్ని పార్టీలు తటస్థంగా మిగిలిపోతున్నాయి. వీటన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఏకోన్ముఖంగా రాజకీయ సమీకరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బీజేపీకి పోటీదారుగా ప్రతిపక్ష కూటమి నిలవగలుగుతుంది. కేంద్రంలో అధికారం కోసం క్లెయిం చేయగలుగుతుంది. ఈ విషయంలో పిల్లి మెడలో గంట కట్టేదెవరన్న ప్రశ్న ఎదురవుతోంది. అటు యూపీఏలోని పక్షాలు రాహుల్ గాంధీ సహా ఎవరూ దేశవ్యాప్తంగా అన్నిపార్టీలను మోడీకి వ్యతిరేకంగా సంఘటితం చేయగలస్థాయిలో లేరు. ఈ స్థితిలో ఆ పాత్రను పోషించేందుకు ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రధాన పార్టీలన్నిటినీ కలిసి కాంగ్రెసు పార్టీకి అనుసంధానంగా రాజకీయ కూటమిగా ముందుకు తెచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాంతీయపార్టీలను ఎగ్జిట్ పోల్స్ బాగా భయపెట్టాయి. ఎన్డీఏకు ఎదురు నిలవాలంటే సాహసించలేని స్థితి ఏర్పడింది. దీంతో నిన్నామొన్నటివరకూ ప్రతిపక్ష కూటమికి సై అన్న పార్టీలు సైతం యూపీఏతో ఎడమొఖం పెడమొఖం గా మారిపోయాయి.జాతీయ స్థాయిలో అన్నిపక్షాలను ఒకే తాటిమీదకు చేర్చే అంశం చాలా ముఖ్యం. అందుకుగాను ఈవీఎం లలో లోపాలు అనే కీలకమైన విషయాన్ని తెరపైకి తెచ్చి దానిచుట్టూ ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో ఫలితాలు అటుఇటుగా తారుమారైనప్పటికీ తనదైన పాత్రను జాతీయ రాజకీయ యవనికపై పోషించేందుకు అనుకూలంగా అందర్నీ కూడగట్టేందుకు పదేపదే బాబు పర్యటనలు చేశారు. ఈవిషయంలో ప్రధానప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కంటే టీడీపీ అధినేతే చురుకైన పాత్ర పోషించారని చెప్పాలి. అయితే దీనిపై రాష్ట్రంలో మాత్రం అనేక విమర్శలు వచ్చాయి. చంద్రబాబు చేతల వెనక రాజకీయ రహస్యం ఉందని గుసగుసలు వినిపించాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోందని పరాజయానికి ముసుగు వేసేందుకే ఈవీఎంల అంశాన్ని వెలికి తెచ్చారని వైసీపీ తీవ్రంగానే విమర్శించింది. ఏదేమైనప్పటికీ ఆరోపణలు, విమర్శలను పక్కనపెడితే విపక్షాలను ఏకం చేసింది చంద్రబాబు చాణక్యం. జాతీయ రాజకీయ పాత్రను సొంతంగా నిర్మించుకోగలిగారు. కాంగ్రెసు దూతగా దౌత్యం చేపట్టారు. ఇది భవిష్యత్తు రాజకీయానికి పక్కాగా పనికొస్తుంది.ఈ సార్వత్రిక ఎన్నికల్లో సాగినంత రచ్చ గతంలో ఎన్నడూ లేదు. వ్యక్తికేంద్రంగా ప్రాంతీయపార్టీల నాయకులు,జాతీయ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు. తీరా చూస్తే ప్రధాని నరేంద్రమోడీ చివరికి తనకు ఎన్నికల ప్రచారం తీర్థయాత్రను తలపించిందంటూ ఫైనల్ ట్విస్టు ఇచ్చారు. ఒకరకంగా చూస్తే నరేంద్రమోడీ తెలివైన ఎత్తుగడతోనే ప్రచారం కొనసాగించారు. మమత బెనర్జీ, రాహుల్ పై వ్యక్తిగత వివాదాలతో మొత్తం ప్రచారమంతా దాని చుట్టూ కేంద్రీక్రుతమయ్యేలా చూసుకోగలిగారు. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై పెద్దగా చర్చ సాగకుండా చేసుకున్నారు. ఫలితంగా తన ప్రచారం సాఫీగా, అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోయినట్లే చెప్పుకోగలగాలి. అందువల్లనే తీర్థయాత్ర ఉపమానం మోడీకి గుర్తుకు వచ్చింది. ఫలితాల ముంగిట్లో ఇద్దరు పర్యాటకులు తాము ఆశించిన విజయం సాధించామని భావించడం విశేషం. ఇప్పటికీ భారతీయజనతాపార్టీనే పెద్ద పక్షంగా అవతరిస్తుందనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అది మోడీ విజయంగానే చూడాలి. అలాగే విపక్షాలు ఎంతోకొంత మేరకు ఒకే వేదికను నిర్మించుకుని చివరివరకూ పోరాటం చేయగలిగారంటే చంద్రబాబు చలవగానే చెప్పాలి.

No comments:

Post a Comment