Breaking News

18/05/2019

ప్లాస్టిక్ పై గ్రేటర్ లో యుద్ధమే

హైద్రాబాద్, మే 18, (way2newstv.in)
హైద్రాబాద్ నగరంలో సైతం నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఈ వ్యర్థాలు అడ్డంకిగా మారి ఏటా తీవ్ర ముంపు సమస్య ఎదురవుతున్నది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వడానికి కారణం కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలేనని అనేక సార్లు అనుభవపూర్వకంగా రుజువైంది. దేశంలోని దాదాపు సగానికిపైగా రాష్ర్టాలు 50మైక్రాన్లకన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) నివేదిక ప్రకారం భారత నగరాలు ప్రతిరోజూ 15000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్కో ట్రక్కులో 10 టన్నుల చొప్పున రోజుకు 1500 ట్రక్కుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. అందులో 9000 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా, మిగిలిన 6000 టన్నులు, అంటే 600 ట్రక్కుల వ్యర్థాలు చెత్త డంపింగ్ కేంద్రాలు, రోడ్లు, నాలాలు తదితరవాటిల్లో పడేస్తున్నారు. వ్యర్థాల్లో దాదాపు 66 శాతం ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సంబంధించినవి కూడా, ఇవి ఆయా నివాస ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అంతేకాదు, దేశంలో ఏటా 5.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో 60 శాతం వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. 


 ప్లాస్టిక్ పై గ్రేటర్ లో యుద్ధమే

ఈ కారణంగా ఏటా దాదాపు ఒక మిలియన్ సముద్రపు పక్షులు, లక్ష వరకూ సముద్ర జంతువులు చనిపోతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర సహా ప్రపంచంలోని పది నదుల ద్వారా 90 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర 25 ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. మన నగరంలో సైతం దాదాపు ఐదేండ్ల కిందటే 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను నిషేధించారు. అయితే అమలు కాగితాలకే పరిమితమైంది. దేశంలో ఎక్కడా ప్రభావవంతంగా నిషేధం అమలవుతున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మన నగరంలో నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తయారీ కేంద్రం నుంచి వినియోగం వరకు అన్ని చోట్లా నిర్బంధం విధించడం ద్వారా నిషేధాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. డెబ్రిస్‌ను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా ఓ క్రమపద్ధతిలో దాన్ని నిర్ణీత కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ చేయడం ద్వారా పునర్వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం విదితమే. దీనికోసం జీడిమెట్ల, ఫతుల్లగూడల్లో ప్రత్యేకంగా రెండు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వచ్చేనెలా 5 నుంచి డెబ్రిస్‌పై నిర్బంధాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఇది గాడిలో పడగానే ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి కేంద్రీకరించి దేశంలో మరే నగరంలో లేని విధంగా మన నగరాన్ని పూర్తిగా జీరో ప్లాస్టిక్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా 50మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను వినియోగించేవారికి రూ. 500 జరిమానా విధించాలని నిర్ణయించారు. అంతేకాదు, విక్రయించే వారికి మొదటిసారి రూ. 10వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. మూడోసారికి దుకాణాన్ని సీజ్ చేయడమే కాకుండా వస్తువులను జప్తు చేస్తారు. ప్లాస్టిక్ నిషేధం అమలుపై సర్కిళ్లవారీగా డ్రైవ్‌లు చేపట్టనున్నారు. జూన్ చివరినుంచి కానీ, జూలై మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. 

No comments:

Post a Comment