Breaking News

13/05/2019

కాంగ్రెస్ లో కోవర్టుల టెన్షన్

హైద్రాబాద్, మే 13, (way2newstv.in)
కాంగ్రెస్‌లో కోవర్టు ఆపరేషన్‌ జరుగుతున్నదా? పార్టీ కీలక నేతలే అందుకు అవకాశం కల్పించారా? పార్టీ వైఫల్యాలకు మూల కారణం వారేనా? అసలు కోవర్టులెవరు? అధిష్టానం గుర్తించిందా? తదితర అంశాలపై చర్చోపచర్చలు ఊపందుకున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు వి హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, వారి పేర్లు త్వరలోనే బయటపెడతామని బహిరంగంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులెవరు? అనే విషయాలపై గాంధీభవన్‌లో గుసగుసలు ప్రారంభమ య్యాయి. పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న వెంటనే ఇక్కడి అధికార పార్టీకి తెలుస్తున్నాయనీ, దానికి అధికార టీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ కాంగ్రెస్‌పార్టీని దెబ్బతీస్తున్నదని కొంత మంది నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా కోవర్టులపై గుసగుసలు వినిపించినా...ఎవరు బహిరంగంగా ప్రస్తావించలేదు. ముందస్తు ఎన్నికల ఫలితాలు, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ నేతలు వ్యవహరించిన తీరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పార్టీ నేతలు పట్టించుకోకపోవడం, వారిని వదిలేయడంతో అధికార టీఆర్‌ఎస్‌ చేపట్టిన కోవర్టు ఆపరేషన్‌ వల్లే ఇదంతా జరుగుతున్నదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


కాంగ్రెస్ లో కోవర్టుల టెన్షన్

కాంగ్రెస్‌ పార్టీని పణంగా పెట్టి ఆ పార్టీ ఘోర వైఫల్యాలకు పార్టీ కీలక నేతలే కారకులని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. పార్టీ నేతలు అంతర్గతంగా కీలక నిర్ణ యాలు తీసుకుంటే అధికార పార్టీకి ఇట్టే తెలిసిపోతున్నదని పార్టీ నేతలు ఆవేదన చెందు తున్నారు. ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను ఎంతో జాప్యం చేయడం, ఉన్నట్టుండి కొత్తవారికి తెరపైకి తీసుకురావడం, కీలక నేతలు ప్రచారానికి వెళ్లకుండా హోటల్‌కే పరిమితం కావడం అందులో భాగమేనన్న పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుల పేరుతో సమయాన్ని వృధా చేశారని ఆరోపణలున్నాయి. పొత్తులపై కాంగ్రెస్‌ నేతలతోపాటు టీడీపీ, టీజే ఎస్‌, సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దీని ప్రభావం గత ఎన్నికల ప్రచారంపై పడింది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారాన్ని సైతం పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ఏ అభ్యర్థికి ఎక్కడ టికెట్‌ ఇవ్వాలి. ఎవరిపై ఎవర్ని బరిలో దించాలి. ఇలా పలు విషయాలల్లోనూ పార్టీ అంచనా తప్పినట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి 'క్యూ' ఎందుకు కడుతున్నారే ప్రశ్న ఆ పార్టీ నేతలను వేధిస్తున్నది. ఈ విషయంలో ఆ పార్టీ కీలక నేత సైతం చొరవ తీసుకుని పార్టీ ఎందుకు మారుతున్నారనే విషయంలో సదరు ఎమ్మెల్యేలకు భరోసా కల్పించలేదనే క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పైగా పోయే వారిని ఆపుతామా? అంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కీలక నేతలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారే ముందు పార్టీ కీలక నేతలతో సరదాగా గడిపి ఆ తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. సీఎల్పీ సమావేశాల్లోనూ చురుకుగా పాల్గొనడంతోపాటు కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేసి నమ్మించి మరి పార్టీని వీడుతున్నారు. పార్టీ సీనియర్‌ నేతలకు నమ్మినబంటుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారడం కూడా కోవర్టు ఆపరేషన్లో భాగమేనని తాజాగా పార్టీ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌ ఫలితాల తారుమారు కావడంతో మనస్తాపం చెంది 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులు అందోళన చేస్తుంటే...ఐదారు రోజుల తర్వాత పార్టీ స్పందించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శల తాకిడి పెరిగిన తర్వాత మొక్కుబడిగా కార్యక్రమాలు చేపట్టారు. కోవర్టు ఆపరేషన్‌ ఫలితంగా కాంగ్రెస్‌పార్టీ ఒకవైపు బలహీన పడుతుండగా, మరోవైపు ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయే పరిస్థితి నెలకొన్నదని పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

No comments:

Post a Comment