Breaking News

27/05/2019

మరాఠలో మరోసారి ఆధిపత్యం


ముంబై, మే 27(way2newstv.in)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కమలం పార్టీ పరువును నిలబెట్టారు. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమికి కాంగ్రెస్ కూటమి కకావికలమయింది. గతంలో వచ్చిన సీట్లైనా వస్తాయా? రావా? అన్న సందేహాలకు తెరదించారు. మోదీ, అమిత్ షాలు తనపై ఉంచిన నమ్మకాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ నిలబెట్టుకున్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం వెనక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కృషి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.లోక్ సభ ఎన్నికలకు ముందు దేవేంద్ర ఫడ్నవిస్ మరాఠా రిజర్వేషన్లకు ఓకే చెప్పారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అగ్రవర్ణాల రిజర్వేషన్లు కూడా ఈ రాష్ట్రంలో పనిచేశాయి. మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత సంఖ్యాపరంగా అతి పెద్ద రాష్ట్రంగా చెప్పాలి. మొత్తం 48 పార్లమెంటు స్థానాలున్నాయి. 


మరాఠలో మరోసారి ఆధిపత్యం
గత ఎన్నికల్లో శివసేన, బీజేపీ స్వీప్ చేశాయి. అయితే ఈసారి ఎన్నికలకు ముందు శివసేన, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకదశలో రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగింది.కానీ దేవేంద్ర ఫడ్నవిస్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ఒప్పించగలిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి పార్లమెంటు ఎన్నికల్లో స్నేహహస్తం అందించాలని కోరారు. రాష్ట్రీయ స్వయం సేవక్ కూడా జోక్యం చేసుకుంది. చివరకు ఉద్దవ్ థాక్రే అంగీకరించారు. దీంతో ఇద్దరూ కలసినా ప్రజలు ఈసారి పట్టం కడతారా? అన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ కూటమికూడా మహారాష్ట్రలో బలంగా కన్పించింది. ప్రధానంగా శరద్ పవార్ తో జత కట్టిన కాంగ్రెస్ ఈసారి ఇరవైకి తగ్గకుండా స్థానాలను కైవసం చేసుకుంటామని విశ్వాసంతో ఉంది.అయితే వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మొత్తం 48 స్థానాల్లో భారతీయ జనతాపార్టీ 23 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ నాలుగు స్థానాల్లోనూ, ఇద్దరు ఇతరులు గెలుపొందారు. ఇలా మరోసారి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి దాదాపు స్వీప్ చేసిందనే చెప్పాలి. బీజేపీకి మరాఠాలు మరోసారి అండగా నిలిచారు. దీంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఫడ్నవిస్ సమాయత్తం అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం లో నుంచిరాజకీయాల్లోకి అడుగుపెట్టి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ లోక్ సభ ఎన్నికలు కమలం పార్టీకి మహారాష్ట్రలో ఊపిరిపోశాయనే చెప్పాలి.

No comments:

Post a Comment