Breaking News

16/05/2019

ఎండిన పంటలతో చినీ రైతుల ఆందోళన

అనంతపురం, మే 16, (way2newstv.in)
కరువు సీమ అనంతపురంలో అంతో ఇంతో ఆసరాగా ఉండే చీనీ పంట ఈ ఏడాది రైతుకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదుకావడంతో పాటు బోరుబావుల్లో నీరుకూడా ఇంకిపోవడంతో చీనీ చెట్లు కళ్లముందే ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. శింగనమల, నార్పల, యల్లనూరు, పుట్లూరు తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలోనే 200 ట్యాంకర్లతో రైతులు నీటిని తోలుకుని పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రోజుకు 30 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదోరకంగా చెట్లను బతికించుకుంటే వచ్చే ఏడాదైనా వర్షం పడక పోదా... నాలుగు కాసులు కంట చూడకపోతామా అన్న ఆశ రైతుది ! ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని వీరంటున్నారు. జిల్లాలో 1.21 లక్షల ఎకరాల్లో చీనీ సాగవుతోంది. వీటిలో అత్యధికభాగం పంట ఈ ఏడాది నిలువునా ఎండిపోతోంది. 


ఎండిన పంటలతో చినీ రైతుల ఆందోళన

గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు అధికారిక సమాచారం. కరువు సీమ కావడంతో మిగిలిన జిల్లాలతో పోలిస్తే అనంతపురంలో తక్కువ వర్షపాతం నమోదవుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది కనీస వర్షపాతం కూడా కురవలేదు. ఐఎండి లెక్కల ప్రకారం జిల్లాలో గత జూన్‌ నుండి ఇప్పటి వరకు 527.90 మి.మీ సాధారణ వర్షపాతం కురవాల్సిఉండగా, 300మి.మీ మాత్రమే కురిసింది. 300 మి.మీ. అంతకన్నా తక్కువ వర్షపాతం జిల్లాల్లో అత్యంత అరుదుగా మాత్రమే నమోదవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి వంద సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో మాత్రమే జిల్లాలో ఇంత తక్కువగా వర్షం కురుస్తోంది. ఇక్రిశాట్‌ చేసిన అధ్యయనం సైతం కొంచెం అటుఇటుగా ఇదే విషయాన్ని తేల్చింది. 1911 నుండి 1989 వరకు ఆరు సంవత్సరాల్లో 300 కన్నా తక్కువ మి.మీ వర్షపాతం నమోదైనట్టు ఆ సంస్థ గుర్తించింది. అతి తక్కువగా 1984లో 176మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు అతి తక్కువగా వర్షపాతం భూ గర్భజలాలపైకూడా ప్రభావం చూపుతోంది. 2018 మే 14 నాటికి 19.30 మీటర్ల లోతులో లభ్యమైన భూ గర్భ జలాలు ఈ ఏడాది అదే తేదీకి 25.35 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే ఏడాదిలో 6.05 మీటర్లు!జిల్లాలో చీనీ దిగుబడి దేశంలోనే అత్యధికమని చెప్పాలి. ఎకరానికి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 1.21 లక్షల ఎకరాలకుగానూ 1228717 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. అయితే ఈసారి అది సగానికి పడిపోయి ఉంటుందన్నది అంచనా. పది టన్నులు రావాల్సిన చోట నాలుగైదు టన్నులకు మించి రావడం లేదు. దీనికి ప్రధాన కారణం పంట వస్తున్న దశలో నీరు లేకపోవడమే. ఇంత తక్కువగా పంట వచ్చినా మార్కెట్‌లో ధర మాత్రం టన్ను రూ.30 వేలకు మించడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో రూ.1.20 లక్షల వరకు పలికింది. కానీ ఈసారి దిగుబడి తగ్గడం, ధర లేకపోవడంతో అన్ని విధాలుగా చీని రైతులు నష్టపోతున్నారు.

No comments:

Post a Comment