Breaking News

01/05/2019

కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, మే 1,  (way2newstv.in)
 కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హుద్రోగ, కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఏప్రిల్ 3న ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన విశేష సేవలు అందించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు.ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు.  


కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

అప్పట్నుంచి చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి మంగళవారం రాత్రి  ప్రాణాలు విడిచారు.1950 జూన్ 4న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో ఎస్పీవై రెడ్డి జన్మించారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందిన ఆయన 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు. ఎస్పీవై రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది. 1991లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో నంద్యాల, గిద్దలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రెండింటిలోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. 2000లో నంద్యాల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్పీవై విజయం సాధించారు. ఎస్పీవై రెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. నంది గ్రూపు సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప మనిషి ఎస్పీవై అని కొనియాడారు. ఆయన మృతి కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి తీరని లోటన్నారు. ఎంపీగా ఆయన విశేష సేవలు ప్రశంసనీయమన్నారు.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  ఎస్పీవై రెడ్డి మృతి వార్త తెలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

No comments:

Post a Comment